NewsTelangana

మునుగోడు బాధ్యతల్లో కేసీఆర్‌..!

టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన సీఎం కేసీఆర్‌ ఇక మునుగోడుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. మండలాల వారీగా మంత్రులకు, గ్రామాల వారీగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. అందులో భాగంగా గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్‌కు మర్రిగూడ మండలంలోని లెంకలపల్లి గ్రామ బాధ్యతలు లభించాయి. అయితే.. కేసీఆర్‌ తరఫున వంటేరు ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలో గజ్వేల్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు ఆ గ్రామంలో ప్రచార బాధ్యతలు చేపడతారు. గురువారం నుంచి కేటీఆర్‌, హరీష్‌రావుతో పాటు పార్టీ నాయకులంతా మునుగోడులోనే మకాం పెట్టాలని సీఎం ఆదేశించారు.  

కూసుకుంట్లకే టీఆర్‌ఎస్‌ టికెట్‌..

మునుగోడులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్‌ లభించడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌ కూడా రెడ్డి సామాజిక వర్గాల వారికే టికెట్లు కేటాయించినందున బీసీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మునుగోడులో రెడ్ల పోరు తప్పదనే తెలుస్తోంది. ఇప్పటి వరకూ జరిపిన సర్వేల ప్రకారం టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని తేలిందని.. అయితే ఎవరూ నిర్లిప్తతతో ఉండొద్దని కేసీఆర్‌ హెచ్చరించారు. ఈసీ గుర్తింపు వస్తే మునుగోడులో బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. గుర్తింపు ఆలస్యమైతే టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసే చివరి అభ్యర్థిగా కూసుకుంట్ల నిలుస్తారు.

ప్రచారం ఉధృతం..

ఈ నెల 24వ తేదీ నుంచి రాహుల్‌ గాంధీ పాదయాత్ర తెలంగాణాలోకి అడుగుపెట్టనుంది. రాష్ట్రానికి చెందిన కీలక నేతలంతా ఈ పాదయాత్రలో పాల్గొంటారు. ఇదే అదనుగా మునుగోడులో ప్రచారాన్ని ఉధృతం చేయాలని టీఆర్‌ఎస్‌ నేతలకు కేసీఆర్‌ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. వరుసగా సభలు, రోడ్‌ షోలు నిర్వహిస్తూ ప్రజలను టీఆర్‌ఎస్‌ వైపు ఆకర్షితులను చేయాలని సూచించారు. కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని త్వరలో ప్రకటిస్తారని, కేసీఆర్‌ బహిరంగ సభ వచ్చే వారం నిర్వహిస్తారని టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి.