NationalNews

దేశ వ్యాప్తంగా దివాళీ నుంచి 5 జీ నెట్ వర్క్ అందుబాటులోకి

న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో అక్టోబర్ 1-4 వరకు జరగనున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 6వ ఎడిషన్‌లో ప్రధాని 5జీ టెక్నాలజీని ప్రారంభించారు. దీపావళి తర్వాత 13 భారతీయ నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన తర్వాత, 5G ఏమి చేయగలదో ప్రత్యక్ష అనుభవాన్ని పొందారు మోదీ. వివిధ టెలికాం ఆపరేటర్లు, టెక్నాలజీ ప్రొవైడర్లు ఏర్పాటు చేసిన పెవిలియన్‌ల మోదీ పరిశీలించారు. ట్రూ 5G పరికరాలు ఎలా పనిచేస్తున్నాయన్నది వీక్షించారు. టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్, రిలయన్స్‌ అధినేత ముఖేష్ అంబానీ, భారతీ ఎయిర్‌టెల్‌ హెడ్ సునీల్ భారతి మిట్టల్, వోడాఫోన్ ఐడియాకు చెందిన కుమార్ మంగళం బిర్లాతో కలిసి ఆధునిక టెక్నాలజీ సృష్టించే మార్పులను మోదీ తెలుసుకున్నారు.

ఆ తర్వాత ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, సీ-డాట్ సంస్థల స్టాల్స్‌ను సందర్శించారు. ఎగ్జిబిషన్‌లో డ్రోన్ ఆధారిత వ్యవసాయం, హై-సెక్యూరిటీ రౌటర్లు, సైబర్ థ్రెట్ డిటెక్షన్ ప్లాట్‌ఫార్మ్‌లు, ఆటోమేటెడ్ గైడెడ్ వాహనాలు, అంబుపాడ్ – స్మార్ట్ అంబులెన్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ/వర్చువల్ రియాలిటీ వ్యవస్థల్లో 5జీ రాకతో గణనీయమైన మార్పులు వస్తాయని అంచనా వేస్తున్నారు. విద్య, నైపుణ్యం అభివృద్ధి, మురుగునీటి పర్యవేక్షణ వ్యవస్థ, స్మార్ట్-అగ్రి ప్రోగ్రామ్, హెల్త్ డయాగ్నస్టిక్స్ మొదలైన వాటిలో భవిష్యత్‌లో రానున్న మార్పులను వివరించారు.

ఆసియాలో అతిపెద్ద టెలికాం, మీడియా టెక్నాలజీ ఫోరమ్… ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC), డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT), సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) సంయుక్తంగా ఈ ఈవెంట్‌‍ను నిర్వహిస్తున్నాయి. 5జీ అందుబాటులోకి రావడంతో నాణ్యమైన వీడియోలను, నిడివి ఎక్కువగల సినిమాలను కంప్యూటర్లు, మొబైల్ ద్వారా సెకన్ల వ్యవధిలో డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలు కలుగుతుంది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా 5G ఇ-హెల్త్, కనెక్ట్ చేయబడిన వాహనాలు ఎంతో చక్కగా పనిచేస్తాయ్. 5G కొత్త ఆర్థిక అవకాశాలను సృష్టిస్తుంది. మార్కెట్ విస్తృతిని పెంచుతుంది. భారతీయ సమాజం ప్రపంచంతో పోటీ పడేందుకు ఇది సహకరిస్తుంది. అభివృద్ధికి అడ్డుగా ఉన్న సాంప్రదాయ అడ్డంకులను అధిగమించడానికి, స్టార్టప్‌లు, వ్యాపార సంస్థల ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అలాగే డిజిటల్‌ను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. 5 జీ టెక్నాలజీ భారత్‌కు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 2023- 2040 మధ్యకాలంలో భారతీయ ఆర్థిక వ్యవస్థను ₹ 36.4 ట్రిలియన్ల అంటే ($455 బిలియన్లు) సుమారుగా 37 లక్షల కోట్ల రూపాయలు మేర మేలు చేసే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు.

ఇటీవల నిర్వహించిన టెలికాం స్పెక్ట్రమ్ భారతదేశపు అతిపెద్ద వేలంగా రికార్డు సృష్టించింది. లక్షన్నర కోట్ల బిడ్‌లను అందుకుంది, ముఖేష్ అంబానీ జియో మొత్తం సగం ఫ్రీక్వెన్సీని ₹ 88,078 కోట్ల బిడ్‌ కొనుగోలు చేసింది. తక్కువ వ్యవధిలో దేశంలో 5G టెలికాం సేవలను 80 శాతం కవరేజీని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలో చెప్పారు. ఇటీవల దేశ రాజధానిలో జరిగిన ఒక పరిశ్రమ ఈవెంట్‌లో వైష్ణవ్ మాట్లాడుతూ, 5G ప్రయాణం చాలా ఆనందదాయకంగా ఉంటుందని… చాలా దేశాలు 40 శాతం నుండి 50 శాతం కవరేజీని చేరుకోవడానికి అనేక సంవత్సరాలు పట్టిందని… ఇండియా మాత్రం చాలాచాలా తక్కువ సమయంలో 80 శాతం కవర్ చేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.