6 నెలల ముందే చెప్పేస్తా- వైఎస్ జగన్
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో ప్రజలతో ముఖాముఖీ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం గడపగడప విషయంలో నిర్లక్ష్యం వద్దని పార్టీ నేతలను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఎంత చెప్తున్నా కొంత మంది మారడం లేదని… అలాంటి వారందరిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తాజాగా 27 మంది ఎమ్మెల్యేలు, మంత్రులపై జగన్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఎంత చెప్పినా పద్దతి మార్చుకోరా అంటూ హితబోధ చేశారు. మీరు మారండి.. లేదంటే మిమ్మల్ని మీర్చేయాల్సి వస్తోందని కుండబద్ధలు కొట్టేశారు. నవంబర్‌లో ఎమ్మెల్యేల పనితీరు రివ్యూ చేస్తానన్నారు. ఎన్నికలకు 6 నెలల ముందు సీటు ఇవ్వని అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని తేల్చి చెప్పారు.

గడప గడపకు కార్యక్రమంపై సీఎం జగన్ రివ్యూ చేశారు. వైసీపీ ప్రజాప్రతినిధులు.. ప్రతి గడపకు సమయం కేటాయించాల్సిందేనని లేకుంటే చర్యలు తప్పవన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో జగన్ భేటీ అయ్యారు. గ్రామ/వార్డు సచివాలయాల్లో సమయం గడపాలని నేతలను ఆదేశించారు. ఎక్కడా నిర్లక్ష్యం పనికిరాదని హెచ్చరించారు. గతంలో సమీక్షించినప్పుడు కొందరు మారారని.. ఇంకొందరు తీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఇప్పటి వరకు కార్యక్రమం జరిగిన తీరు.. ఇకపై ప్రజాప్రతినిధులు ఏం చేయాలన్నదానిపై జగన్ దిశా నిర్దేశం చేశారు.


