ఎన్టీఆర్ పేరును అందుకే తొలగించారు
హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్పుపై స్పందించారు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్‌ను చంపినవారు ఆయన గురించి ఎలా మాట్లాడతారని ఆమె ప్రశ్నించారు. గతంలోనూ పేర్లను మార్చుకున్నారని… ఇప్పుడు అదే విషయంపై ఎందుకు రాద్ధాంతం చేస్తారని మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరు తీసేయాలని చంద్రబాబు గతంలో ఓ జర్నలిస్టుతో కలిసి మాట్లాడుకోలేదా..? అని ప్రశ్నించారు. ఇప్పుడు పేరు మార్చితే ఎందుకు విమర్శిస్తున్నారన్నారు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ పేరు హెల్త్ యూనివర్సిటీకి ఉండాలా… లేదంటే జిల్లాకు ఉండాలా.. అన్న చర్చ వచ్చినప్పుడు.. జిల్లాకు ఉండాలనే సమర్థిస్తానన్నారు. రూపాయి వైద్యుడిగా వైఎస్సార్ చేసిన మేలును గుర్తించుకునేలా తీసుకున్న నిర్ణయం సమంజసమన్నారు లక్ష్మీపార్వతి.

మరో ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పేరు..
మరో ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టేలా సీఎం జగన్ వద్దకు వెళ్తానన్నారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసినంత మాత్రాన ఆయనను అగౌరవ పరిచినట్టు ఎందుకవుతుందన్నారు. యూనివర్సిటీ ఉన్న జిల్లాకే ఎన్టీఆర్ పేరున్నప్పుడు బాధపడాల్సిన పనిలేదన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా చేసిన ఘనత చంద్రబాబుదే అని ఆమె నిప్పులు చెరిగారు. సుదీర్ఘ మీడియా సమావేశంలో టీడీపీని, చంద్రబాబును తూర్పారబట్టిన లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ వారసులపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.