యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా.. పోలీసులు ఎన్ని షీ టీమ్స్ ఏర్పాటు చేసినా.. అమ్మాయిలపై అఘాయిత్యాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ముషీరాబాద్‌కు చెందిన ఓ ఉన్మాది ప్రేమ పేరుతో యువతిపై కత్తితో దాడి చేశాడు. భోలక్‌పూర్ బస్తీకి చెందిన 18 ఏళ్ల యువతి సమీపంలోని ఓ ప్రైవేటు మెడికల్ షాపులో పని చేస్తోంది. అదే బస్తీకి చెందిన రంజిత్ అనే 18 ఏళ్ల యువకుడు ఆ యువతిని ప్రేమ పేరుతో నిత్యం వేధించేవాడు. ఆమెతో మాట్లాడాలంటూ రోజూ వెంట పడేవాడు. శనివారం రాత్రి కూడా మాట్లాడాలంటూ యువతిని ఉస్మానియా యూనివర్సిటీలోని మానేరు వసతి గృహం వద్దకు తీసుకెళ్లాడు.

తనను ప్రేమించాలని.. పెళ్లి చేసుకుంటానని నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు. ఆ యువతి ససేమిరా అనడంతో వెంట తెచ్చుకున్న కత్తితో యువతిపై దాడి చేశాడు. ఆమె చేయి అడ్డం పెట్టడంతో చేతికి తీవ్రగాయమైంది. యువతి అరుపులకు స్థానికులు రావడంతో యువకుడు పారిపోయాడు. పోలీసులు, స్థానికులు యువతిని కాచిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పతికి తరలించారు. యువతి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఉన్మాది కోసం గాలిస్తున్నారు.