నవరాత్రులలో బతుకమ్మ సంబురాలు
దేశవ్యాప్తంగా అమ్మవారి నవరాత్రి సంబరాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. అయితే తెలంగాణా రాష్ట్రంలో ఈ నవరాత్రిని మరొక ప్రత్యేకరీతిలో జరుపుకుంటారు. తెలంగాణా ఆడపడుచులు ‘బతుకమ్మ’ పేరుతో ఈ ఉత్సవాలను తొమ్మిది రోజులు ఆటపాటలతో సంబరంగా జరుపుకుంటారు. ఈ సంబరాల్లో భాగంగా తొమ్మిదిరోజుల పాటు తొమ్మిది రకాల ప్రత్యేకపూలను పూజిస్తారు. ఈ పువ్వులను గోపురంలా అమర్చి, మధ్యలో పెట్టి, ‘ ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ మహిళలంతా దానిచుట్టూ నృత్యం చేస్తూ, పాటలు పాడుతూ ఆడతారు. ఈ బతుకమ్మ సంబురాలకు సంబంధించి పురాణ కథలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది జగన్మాత కథ. పురాణ కాలంలో మహిషాసురుడిని వధించేందుకు వచ్చిన జగన్మాత అలసిపోయి నిద్రలోకి వెళ్లిందట. ఆమెను లేపేందుకు స్త్రీలందరూ కలిసి పాటలు పాడారట. ఆ సమయంలోనే బతుకమ్మ పేరిట తనను ఆరాధించారని విశ్వాసం. అలా తొమ్మిది రోజుల పాటు వేడుకుంటే అమ్మవారు నిద్రలేచిందట. మహిషాసురుడిని సంహరించిందట. అప్పటినుండి అమ్మవారి స్థానంలో పూలను పేర్చి పూజించడం అనేది సంప్రదాయంగా మారిందట.

నవరాత్రులలో ‘బతుకమ్మ’ పేర్లు:
1వ రోజు-ఎంగిలిపూల బతుకమ్మ,
2వ రోజు-అటుకుల బతుకమ్మ
3వ రోజు-ముద్దపప్పు బతుకమ్మ
4వ రోజు-బియ్యం బతుకమ్మ
5వ రోజు-అట్ల బతుకమ్మ
6వ రోజు-అలిగిన బతుకమ్మ
7వ రోజు-వేపకాయల బతుకమ్మ
8వ రోజు-వెన్నముద్దల బతుకమ్మ
9వ రోజు-సద్దుల బతుకమ్మ ఇలా తొమ్మిదిరోజుల పాటు తొమ్మిది రూపాలతో అమ్మవారిని ఆరాధిస్తారు. తెలంగాణాలోనే కాక ఇతర దేశాల్లో స్థిరపడిన తెలంగాణా వాసులంతా అక్కడ కూడా బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ముఖ్యంగా అమెరికా, లండన్ దేశాలలో ఈ బతుకమ్మ సంబరాలకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.