Andhra PradeshNews

టీటీడీ కీలక నిర్ణయం.. వీఐపీ దర్శనాలు రెండు గంటలే…!

టీడీపీ తీరుపై ఇటీవల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. వీఐపీ సేవలో టీటీడీ అధికారులు తరిస్తున్నారని.. సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమయ్యింది. ఈ నేపథ్యంలో టీటీడీ సామాన్యులకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పాలక మండలి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. బ్రహ్మోత్సవాలు ముగిశాక… వీఐపీ దర్శనం వేళలను ఉదయం 10 నుండి 12 గంటల మధ్యకు మార్చారు. ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చే వీఐపీలంతా ఆ టైమ్ స్లాట్‌లోనే స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇకపై వీఐపీలకు కూడా నిబంధనలు వర్తించనున్నాయ్. బ్రహ్మోత్సవాల తర్వాత స్లాటెడ్ సర్వ దర్శనం… టోకెన్లను రిలీజ్ ప్రక్రియను పునఃప్రారంభించాలని టీటీడీ భావిస్తోంది.

శ్రీవారి బ్రహ్మోత్సవాలపై చర్చించిన టీటీడీ… రెండేళ్ల తర్వాత ఆలయం వెలుపల జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. శాశ్వత వసతి కోసం గోవర్ధన్ అతిధి గృహం వెనుక రూ. 95 కోట్లతో నూతన వసతి భవనం నిర్మాణానికి అమోదం తెలిపింది. తిరుపతిలో వకుళామాత ఆలయం అభివృద్ధి చేయాలని పాలకమండలి నిర్ణయించింది. తిరుమలలో వసతి గృహాలలో గీజర్ల ఏర్పాటు కు రూ. 7.90 కోట్లు కేటాయించారు. నెల్లూరులో శ్రీవారి ఆలయం, కళ్యాణమండపం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలను 6 కోట్ల 37 లక్షలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఇందుకు సంబంధించి 300 ఎకరాలకు అదనంగా మరో 130 ఎకరాలు కొనుగోలుకు చేయాలని నిర్ణయించారు.