‘హిజాబ్’ మంటల్లో ఇరాన్.. 31 మంది మృతి
హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్లో జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. భద్రతాదళాలు, నిరసనకారుల మధ్య తలెత్తిన ఘర్షణల్లో 31 మంది చనిపోయినట్లు తెలిసింది. నిరసనలకు సంబంధించిన సమాచారం బయటికి పొక్కకుండా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలను ఇరాన్ ప్రభుత్వం నిలిపివేసింది. హిజాబ్ ధరించలేదన్న కారణంతో అరెస్టు చేసిన 22 ఏళ్ల మహ్సా అమిని అనే యువతి పోలీసు కస్టడీలో చనిపోవడంతో దేశవ్యాప్తంగా నిరసనలు ప్రారంభమయ్యాయి.

ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులకు సైతం తెగబడ్డారు. కుర్దిస్తాన్ ప్రావిన్స్‌లోనే అత్యధికంగా 15 మంది చనిపోవడం విశేషం. మజందరన్ ప్రావిన్సులో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పలువురు భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. రాజధాని టెహ్రాన్ సహా 30 నగరాల్లో హిజాబ్ లేకుండానే వీధుల్లోకి వచ్చిన మహిళలు రోడ్లపైనే హిజాబ్‌ను తగలబెట్టారు. జుట్టును కతిరించుకొని నిరసన తెలిపారు.