NewsTelangana

నాడు కర్నాటక… నేడు తెలంగాణ

తెలంగాణలో అధికారమే లక్ష్యం
మోదీ, అమిత్ షా వ్యూహరచన
స్థానిక నాయకత్వానికి దిశానిర్దేశం
ఉమ్మడి నాయకత్వంతో అడుగులు
గెలవడమే ముఖ్యమన్న అభిప్రాయం
అన్నీ మంచి శకునములేనన్న భావన

తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది. బీజేపీ ఎదగడానికి కావాల్సిన అన్ని పరిస్థితులు అందుకు సానుకూలంగా మారుతున్నాయ్. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 20కి పైగా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. ఉత్తరాదిలో విస్తరిస్తున్నా.. దక్షిణాదిలో మాత్రం ఆ మేరకు ఊపు రావడం లేదు. కర్నాటకలో కొంత వరకు ఆ పార్టీ అనుకున్న లక్ష్యాలను చేరుకున్నా… ఇతర రాష్ట్రాల్లో ఆ అభిప్రాయం కలగడం లేదు. ఇలాంటి తరుణంలో తెలంగాణపై ఆ పార్టీకి ఉన్న అంచనాలు తొలిసారిగా నిజమయ్యే వాతావరణం కన్పిస్తోంది. 2014లో ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. వరుసగా రెండు టర్మ్‌లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ తమకు అనుకూలంగా మారుతోందన్న దీమాలో ఉన్న బీజేపీ అందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. తగిన గ్రౌండ్ సైతం ప్రిపేర్ చేసుకుంటోంది. తెలంగాణాలో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడన్న ఆలోచనలో ఉన్న కమలనాధులు పూర్తి స్థాయిలో స్టేట్ పై ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో… అవన్నీ చేసేందుకు అధినాయకత్వం రెడీ అయిపోయింది.

బీజేపీ బలపడుతోంది..!
తెలంగాణ అంతటా పార్టీని స్ట్రెంథెన్ చేసేందుకు వీలుగా ఆ పార్టీ నేతలు అడుగులు వేస్తున్నారు. వాస్తవానికి బీజేపీ అంటే అర్బన్ పార్టీ అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీ విజయం సాధించాలంటే ప్రత్యేక కార్యాచరణ కావాలని భావించిన ఆ పార్టీ నేతలు అందుకు తగిన విధంగా సన్నద్ధమవుతున్నారు. ఇటీవల తెలంగాణలో వస్తున్న సర్వేలన్నింటిలోనూ బీజేపీ నెంబర్ 2 పొజిషన్‌లో కన్పిస్తోంది. ఖమ్మం, నల్గొండ జిల్లాలు మినహా మిగతా రాష్ట్రమంతా పార్టీ గతంతో పోల్చితే మెరుగైన ఫలితాలు రాబడుతోంది. ఇప్పటి వరకు వచ్చిన ఏ సర్వే చూసుకున్నా టీఆర్ఎస్ పార్టీకి 8 ఎంపీ స్థానాలు, బీజేపీకి 6 ఎంపీ స్థానాలు వస్తాయన్న సంకేతాలను ఇస్తున్నాయ్. దీంతో ఇంకొంచెం గట్టిగా ప్రయత్నిస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టం కాదన్న భావనలో కమలనాథులు ఉన్నారు. తెలంగాణాలో బీజేపీ 30 శాతానికి పైగా ఓట్ బ్యాంక్‌తో సెకండ్ ప్లేస్ లో ఉందంటూ ఆరా సర్వే సంస్థ సైతం అభిప్రాయపడింది. ఇలాంటి తరుణంలో రాష్ట్రమంతటా అనుకూలంగా మలచుకునేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యంగా తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్, ఉత్తర తెలంగాణాపై పార్టీ పూర్తి ఫోకస్ పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్‌లో కీలక స్థానాల్లో గెలిస్తే పార్టీకి ఇక తిరుగుండదని ఢిల్లీ పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారు. బీజేపీలో ప్రస్తుతం ఉన్న నేతలెవరు? ఇంకెందరు నేతలు బీజేపీలోకి వచ్చే అవకాశం ఉంది.. ఎవరి వల్ల పార్టీకి మేలు కలుగుతోందన్న లెక్కలను ఆ పార్టీ నేతలు వేసుకుంటున్నారు.

ఢిల్లీ నుంచి మానిటరింగ్…!
అదే సమయంలో ఉత్తర తెలంగాణాతోపాటు, మహబూబ్ నగర్, నల్గొండపైనా పార్టీ నేతలు దృష్టి కేంద్రీకరించారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన నల్గొండలో ఆ పార్టీని డామేజ్ చేసేందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఇటీవల గుడ్ బై చెప్పి… బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ద్వారా ఆ పని పూర్తి చేయాలన్న ఆలోచనలో ఆ పార్టీ పెద్దలు ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు అసెంబ్లీకి రాజీనామా చేయడం… అక్కడ ఉపఎన్నికలు రావడంతో రాష్ట్రం మొత్తం అటెన్షన్ అటువైపునకు మళ్లుతోంది. మునుగోడులో ప్రస్తుతం గ్రౌండ్ సిచ్యువేషన్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా… కమలం పార్టీ మాత్రం కుంభస్థలాన్ని కొట్టేందుకు అదే వేదికనుకుంటోంది. ఓవైపు బండి సంజయ్ పాదయాత్ర మరోవైపు ఈటల రాజేందర్ చేరికల వ్యూహాలు ఊపు తీసుకొస్తాయన్న విశ్వాసంలో పార్టీ నేతలు ఉన్నారు. మునుగోడు ప్రాంతంలో బీజేపీకి ఊపు తీసుకురావడానికి నేరుగా రంగంలోకి దిగారు ఈటల రాజేందర్. ఇప్పటికే గ్రామాల వారీగా పార్టీ పరిస్థితిపై రివ్యూ చేసిన ఆయన పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నదానిపై బ్లూ ప్రింట్ తయారు చేసినట్టు తెలుస్తోంది. మునుగోడుకు మాత్రమే పరిమితం కాకుండా జిల్లా అంతటా బీజేపీ బలపడేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఎనీ టైమ్ ఎలక్షన్ కన్ఫ్యూజన్‌
ఇటీవల మునుగోడులో సమరశంఖం పూరించిన అమిత్ షా… నియోజకవర్గం గెలుపు బాధ్యతను స్థానిక నేతలకు అప్పగించారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని.. అప్పుడే విజయం సాధ్యమవుతుందని హితబోధ చేశారు. మునుగోడు ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారన్న చర్చలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న తరుణంలో రిస్క్ తీసుకోకూడదని ఆ పార్టీ భావిస్తోంది. ఓవైపు ఎనీ టైమ్ ఎలక్షన్స్ అన్న భావన ఉన్నప్పటికీ… కేసీఆర్ అప్పటి వరకు కూడా వెయిట్ చేయరన్న చర్చ కూడా ఉంది. దసరా తర్వాత మంచి రోజు చూసుకొని అసెంబ్లీని రద్దు చేస్తారన్న అనుమానం పలువురిలో వ్యక్తమవుతోంది. మొత్తంగా తెలంగాణాలో ఎనీ టైమ్ ఎలక్షన్స్ వచ్చే అవకాశం లేకపోలేదన్న ఫీలింగ్ కలుగుతోంది. కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఉంది. మునుగోడు తెలంగాణ రాజకీయ భవితవ్యాన్ని కొత్త పుంతలు తొక్కేలా చేస్తోందన్న టెన్షన్ అధికార పార్టీలో కన్పిస్తుంటే.. ఏదైనా తేడా కొడితే ఇక అంతే సంగతులని హస్తం పార్టీ వర్రీలో ఉంది.

నాడు కర్నాటక… నేడు తెలంగాణ
ఇలాంటి సిచ్యువేషన్‌ను పూర్తిగా అనుకూలంగా మలచుకోవాలని బీజేపీ యోచిస్తోంది. జాతీయ స్థాయిలో తలనొప్పితో కంగారుపడుతున్న హస్తం పార్టీ తెలంగాణాపై ఫోకస్ పెంచాలని చూస్తున్నా.. స్థానికంగా కుమ్ములాటలు ఆ పార్టీని ముందుకు కదలనివ్వడం లేదు. ఓవైపు రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నా.. తెలంగాణాలో నేతల మధ్య ఉన్న విభేదాలు ఆ పార్టీని వేధిస్తున్నాయ్. ముఖ్యంగా మునుగోడు ఉపఎన్నికలో రేవంత్ వ్యూహాన్ని పార్టీ పెద్దలు ఆమోదించకపోవడం వెనుక అసంతృప్తుల హస్తం ఉందన్న అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టేందుకు ఇదే తగిన సమయమని బీజేపీ భావిస్తోంది. మొత్తంగా అన్నీ మంచి శకునములే అన్నట్టుగా ఆ పార్టీ అడుగులు వేస్తోంది. హుజూరాబాద్ ఎన్నికలో కొండను ఢీకొట్టామన్న ఫీలింగ్‌లో ఉన్న ఆ పార్టీ.. ఇప్పుడు మునుగోడులో విజయం సాధిస్తే.. తెలంగాణాలో ఇక తమకు తిరుగులేదన్న పరిస్థితి వచ్చేస్తోందన్న విశ్వాసంతో ముందుకు కదులుతోంది. సర్వశక్తులు ఒడ్డైనా మునుగోడులో గెలవాలని ఆ పార్టీ భావిస్తోంది. కర్నాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. దక్షిణాదిలో ఆ పార్టీకి కన్పిస్తోంది తెలంగాణ మాత్రమే. అందుకే ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఉమ్మడి నాయకత్వం మాత్రమే శ్రీరామ రక్ష అని ఢిల్లీ పెద్దలు విశ్వసిస్తున్నారు.