యుద్ధానికి ఇది తగిన సమయం కాదు.. పుతిన్‌కు తేల్చి చెప్పిన మోదీ
ఉజ్బెకిస్తాన్‌లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఇది యుద్ధానికి సమయం కాదని అన్నారు. ఉక్రెయిన్ యుద్ధం ఏడు నెలలుగా సాగుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు. మాస్కో దళాలు ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత ఇరువురు నేతలు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి. ఫిబ్రవరిలో ప్రారంభమైన సంఘర్షణ వీలైనంత త్వరగా ముగించాలని కోరుకుంటున్నట్లు పుతిన్‌కు చెప్పారు ప్రధాని మోదీ. మొత్తం జరుగుతున్న యుద్ధం విషయంలో భారత్ ఆందోళనను పుతిన్‌కు మోదీ వివరించారు. అధ్యక్షుడు పుతిన్‌తో అద్భుతమైన సమావేశం జరిగిందన్నారకు ప్రధాని మోదీ. వాణిజ్యం, ఇంధనం, రక్షణతోపాటు, పలు రంగాలలో భారతదేశం-రష్యా సహకారాన్ని మరింతగా కొనసాగించడం గురించి చర్చించేందుకు అవకాశం లభించిందన్నారు. ఇతర ద్వైపాక్షిక, ప్రపంచ సమస్యలపైనా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చించానని చెప్పారు మోదీ.

ఉక్రెయిన్‌లో వివాదంపై మీ వైఖరి, మీ ఆందోళనలు నాకు తెలుసు…. వీలైనంత త్వరగా దీనిని ముగించేందుకు మా వంతు కృషి చేస్తామంటూ పుతిన్ మోదీకి చెప్పారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై చర్చించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసినందుకు భారత్ ఇంతవరకు విమర్శించలేదు. చర్చల ద్వారా సంక్షోభ పరిష్కారానికి న్యూఢిల్లీ పట్టుబడుతోంది.

