సూపర్ బగ్స్ వల్లే కృష్ణంరాజు మరణమా?
కరోనా విజృంభణ దాదాపు ముగిసిన తర్వాత కూడా దేశంలో పరిస్థితులు ఏమీ బాగాలేవు. కరోనాకు చికిత్స తీసుకుని తగ్గిన తర్వాత కూడా పోస్ట్ కరోనా డిసీజెస్ కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. యంటీ బయాటిక్స్‌కు కూడా లొంగని బ్యాక్టీరియాలు ఆందోళనకరంగా మారుతున్నాయి. తాజాగా సినీనటుడు కృష్ణంరాజు మృతికి కూడా కరోనా అనంతర రోగాలే కారణమంటూ ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికలో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ప్రస్తావన ఉండటం కూడా మనం గమనించవచ్చు.

ఇటీవల కాలంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మరియు HAI సర్వేలైన్స్ ఇండియా నిర్వహించిన పరిశోధనల నివేదికలలో కీలక విషయాలు బయటపెట్టాయి. సుదీర్ఘకాలం వైద్యశాలల్లో ఉండి చికిత్స పొందిన వారికి నెగిటివ్ బ్యాక్టీరియాలు సోకుతున్నట్లు గుర్తించాయి. ICMR పరిశోధనలో ఎసినెటో బాక్టర్ బౌమన్ని అనే బ్యాక్టీరియా కూడా ఒకటి. ఇది ఒక నెగిటివ్ బ్యాక్టీరియా. ఇది రక్తం, యూరినరి ట్రాక్ట్, ఊపిరతిత్తులు మొదలైన ఇతర అవయవాల్లో ఇన్ఫెక్షన్లకు కారణమవుతోంది. 2021లో ఈ బ్యాక్టీరియా సోకిన 87.5 నమూనాల్లో అత్యంత శక్తివంతమైన కార్బపెనెమ్ యాంటీ బయాటిక్‌కు కూడా ఇది లొంగలేదని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా నిమోనియా, సప్టిసిమ్యా వంటి వాటి చికిత్సలో ఈ ఔషధం ఉపయోగపడడం లేదని గుర్తిస్తున్నారు. ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకున్నవారిలో ఈరకం సూపర్ బగ్‌లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కొంతకాలం పాటు వెంటిలేటర్లపై, యూరినరీ కాథిటర్‌పై ఉన్నవారిలో ఈ నెగిటివ్ బ్యాక్టీరియాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిని హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్(HAI) అంటారు. ఈ రకమైన బ్యాక్టీరియాలు ICUలలో ఉన్నవారిలో 73.3 శాతం రక్తపు ఇన్ఫెక్షన్లకు, 53 శాతం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతోందని ఎయిమ్స్ మైక్రోబయాలజీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన డాక్టర్ పూర్వా మాథూర్ తెలిపారు. వీరిలో రక్తపు ఇన్ఫెక్షన్లు సోకిన వారిలో 38.1 శాతం, యూరినరీ ఇన్ఫెక్షన్లు సోకిన వారిలో 27 శాతం మంది కేవలం 15 రోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోతున్నట్లు పేర్కొన్నారు.

2021 జనవరి 1 నుండి డిసెంబరు 31 వరకూ పూర్తిగా సంవత్సరం పాటు సమీకరించిన డేటాపై పరిశోధించిన ఐసీఎంఆర్ బృందంలోని శాస్త్రవేత్త డాక్టర్ కామిని వాలియా పేర్కొన్నారు. ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోకపోతే యాంటీ బయాటిక్ రెసిస్టెన్సీ ఓ మహమ్మారిలా మారుతుందని ఆమె హెచ్చరించారు. ఈకోలీ, క్లెబెల్లా నిమోనియా, బాక్టర్ బౌమన్ని, సూడోమోనాస్ మొదలైన అనేక సూక్ష్మజీవులు చాలా బలంగా మారుతున్నాయని, అన్ని రకాల యాంటీబయాటిక్స్‌ను తట్టుకోగలుగుతున్నాయని గమనించారు. వీటివల్ల రక్తం, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లు, శస్త్రచికిత్స జరిగిన భాగాల్లో ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని డాక్టర్ వాలియా తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌లు బలోపేతం చేసి, సమస్యను ఖచ్చితంగా గుర్తించిన తర్వాతే ఔషదాలు ఇవ్వాలని, అంచనాలతో మాత్రం ఇవ్వకూడదని పేర్కొన్నారు. ఈ సూక్ష్మజీవులు ఏటా 5-10 శాతం బలోపేతమవుతున్నాయని, యాంటి బయాటిక్ మందులకు కూడా లొంగని శక్తిని సంతరించుకుంటున్నాయని ఈ పరిశోధనల్లో తేలింది.

