5రోజుల విరామం తర్వాత ప్రారంభమయిన తెలంగాణ ఉభయసభలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల విరామం తర్వాత తిరిగి ఈ రోజు ప్రారంభం కానున్నాయి. శాసనసభ, శాసన మండలిలో ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు చేసి, నేరుగా స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. సభ ప్రారంభం కాగానే కేంద్ర సర్కారు విద్యుత్ బిల్లుపై చర్చ జరగనుంది. ఆ బిల్లును తెలంగాణ సర్కారు వ్యతిరేకిస్తోన్న విషయం తెలిసిందే. చర్చ ద్వారా రాష్ట్ర అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. అలాగే, మున్సిపల్ శాఖ చట్ట సవరణ, జీఎస్టీ చట్ట సవరణ, నిజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ బిల్లులను తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ చట్ట సవరణ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెడతారు.

అంతేగాక, వైద్య, విద్యా శాఖకు సంబంధించిన సవరణ, డీఎంఈ, అసిస్టెంట్ డీఎంఈల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచే చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ములుగు అటవీ యూనివర్సీటీ, తెలంగాణ మోటారు వాహనాల పన్ను చట్ట సవరణ బిల్లునూ సభలో ప్రవేశపెడతారు. కాగా.. ఈనెల 6న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ రోజు కేవలం సంతాపాలకే సభ పరిమితమైంది. పది నిమిషాల్లోనే వాయిదా పడింది. సభా వాయిదా అనంతరం జరిగిన బిజినెస్ అడ్వయిజరీ కమిటీలో ఈనెల 12, 13 తేదీల్లో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.