కేసీఆర్.. జాతీయ పార్టీ ఎందుకు?
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. ఆచితూచి వ్యవహరించడంలో కేసీఆర్ దిట్ట. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తలెత్తే సమస్యలను, ఇష్యూలను బేరీజు వేసుకున్నాకే అడుగు వేస్తారు. అలాంటిది కేసీఆర్ ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితి లేదంటే జాతీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారంటూ కథనాలు వస్తున్నాయ్. దసరా పర్వదినం సందర్భంగా కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నట్టుగా మీడియాలో జోరుగా వార్తలొస్తున్నాయ్. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడానికి గల కారణాలను ఆన్వేషించాలి.

బీజేపీపై కోపంతోనేనా..?
కేసీఆర్ జాతీయ పార్టీని బీజేపీపై కోపంతో పెడుతున్నారా.. లేదంటే తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకు పెడుతున్నారా.. అన్నది తేలాలి. ఎందుకంటే కేసీఆర్ గత ఏడాదిగా బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా మోదీ వ్యవహరిస్తున్నారని.. ఇలాంటి పాలకులు ఇక వద్దంటూ నినదిస్తున్నారు. వాస్తవానికి కేసీఆర్ గురించి తెలిసిన వారెవరైనా.. ఆయన మాటలకు అర్థాలే వేరులే అనుకుంటారు. తెలంగాణ కోసం కొట్లాడి.. తెలంగాణ తెచ్చానంటూ ఆయన కుండబద్ధలు కొడతారు. కానీ.. ఎలాంటి బలం, బలగం లేని కేసీఆర్ తెలంగాణ ఎలా తెస్తాడన్న భావన ఎంత మందికి ఉంటుంది. కేసీఆర్ తెలంగాణ తెచ్చాడు. కానీ.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, బీజేపీ అని గుర్తు పెట్టుకోవాలి. పార్లమెంటులో అంతగా బలం లేని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వాలని అనుకున్నా.. బీజేపీ మద్దతు లేకుంటే తెలంగాణ కల సాకారమయ్యేదేనా? అందరూ కష్టపడితేనే తెలంగాణ సాధ్యమైందని కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలి. కేసీఆర్ మాత్రమే కాదు.. బీజేపీపై విమర్శలు గుప్పించే టీఆర్ఎస్ నాయకులంతా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటే మంచిది. లేదంటే ఏదో ఒక రోజు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే.

తెలంగాణాను గత ఎనిమిదేళ్లలో అద్భుతంగా పాలించానని.. ఇక్కడ అమలు చేసిన పథకాలను దేశంలో ఎవరూ అమలు చేయలేదని కేసీఆర్ చెబుతున్నారు. సరే.. ఇచ్చారనుకుందాం. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి కదా.. లేదంటే ప్రజలు ఊరుకోరు కదా.. ఏం చేశారని జాతీయ రాజకీయాలకు వెళ్తారంటూ అటు ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విరుచుకు పడుతున్నాయ్. ఎన్నికల్లో గెలిచే వరకు ఓడ మల్లన్న అనే కేసీఆర్.. ఆ తర్వాత బోడి మల్లన్న అంటూ ప్రజలను నట్టేట ముంచుతున్న వైనాన్ని విపక్షాలు కళ్లకు కడుతున్నాయ్. రెండో టర్మ్ ఎన్నికలకు ముందు రైతుబంధు అంటూ గారడీ చేసి.. రైతుల వద్ద మార్కులు కొట్టేసి.. ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్.. ఆ తర్వాత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నేటికీ అమలు చేసిన పాపాన పోలేదు. ఉద్యోగాలిస్తానంటూ ఉద్యమం నాటి నుంచి నేటి వరకూ ఊరించడమే తప్ప.. భర్తీ చేస్తున్న ఉద్యోగాలెన్నో మనందరికీ తెలుసు. మళ్లీ ఎన్నికలొస్తున్నాయనే సరికి నోటిఫికేషన్లంటూ మాయమాటలు చెబుతున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానన్న ఎన్నికల హామీ ఏమైందో కూడా తెలియదు. తెలంగాణ వచ్చాక.. ఉద్యోగాలు రాక.. వందల మంది యువత ఆత్మబలిదానాలు చేసుకున్నారు. వారందరి బాధను ఇప్పుడు ఆ కుటుంబాలు మోస్తున్నాయ్. ఇక డబుల్ బెడ్ రూమ్ ఇళ్లంటూ ఎన్నికలప్పుడు కేసీఆర్ ఇచ్చిన ఫుల్ పేజీ ప్రకటనలు ఇప్పటికీ ఆన్‌లైన్‌లో దొరుకుతూనే ఉన్నాయ్. డబుల్ బెడ్ రూమ్‌లపై ఇచ్చిన హామీలేవీ నేటికీ ఆచరణకు నోచుకోలేదు. లక్షలాది ఇళ్లు నిర్మించి ఇస్తానన్న కేసీఆర్.. వేల ఇళ్లనూ నిర్మించలేక పోయారు.

ఇక ప్రాజెక్టుల పేరుతో జరిగిన లూటీ ప్రపంచమంతా చూస్తోంది. నెల రోజుల క్రితం వచ్చిన వరదల్లో కాళేశ్వరం ప్రాజెక్టు బురదలో కూరుకుపోయింది. మోటార్లను బయటకు తీయడానికి ఇంజినీర్లు నానాకష్టాలు పడాల్సి వస్తోంది. అంతేనా.. మిషన్ భగరథ, మిషన్ కాకతీయ ఫలాలు తెలంగాణ ప్రజలకు అందాయా.. అంటే అనుమానమే. లక్ష రూపాయల రుణమాఫీలో రూ.50 వేలు కూడా ఇంకా పూర్తి కాలేదు. 57 ఏళ్లు దాటిన వారికి పింఛన్లు ఇస్తామన్న మాట అసెంబ్లీ నాలుగు గోడలకే పరిమితమైంది. గత నాలుగైదేళ్లుగా వర్షాలు కురవడం వల్ల మాత్రమే తెలంగాణ సస్యశ్యామలమైంది. రైతుల కోసం అది ఇస్తున్నా.. ఇది ఇస్తున్నా.. అని చెప్పే కేసీఆర్ వరి పండిస్తే ఇక అంతే సంగతులంటూ బెదిరించిన రోజులను రైతులు మరిచిపోతారా? రైతులకు బేడీలు వేసిన ఘన చరిత్ర మరిచేదేనా? కొంత మొత్తం ఖర్చు చేస్తే అందుబాటులోకి వచ్చే ప్రాజెక్టులను అటకెక్కించి కాళేశ్వరం కట్టుకథలను జనం నమ్ముతారా? ఉద్యమంలో నుంచి వచ్చి… ఉద్యమానికి జ్యోతిగా వెలిగి… ఆ తెలంగాణ ఫలాలు ప్రజలకు అందిస్తున్న పాపానికి ఈటల రాజేందర్ లాంటి ఉద్యమకారుడ్ని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన ఘన చరిత్ర కేసీఆర్‌ది కాకుండా మరెవరిది? అంతెందుకు? బీజేపీ అలా చేస్తోంది.. ఇలా చేస్తోందని కేసీఆర్ పదేపదే చెప్తారు కదా.. 2014లోనూ, 2018లోనూ విపక్ష ఎమ్మెల్యేలను విలీనం చేసుకున్న ఘన చరిత్ర ఆయనది కాదా?

హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించడానికి మొదలు పెట్టిన దళితబంధు ఇప్పుడు ఎలాంటి పొజిషన్లో ఉంది? అంతెందుకు.. తెలంగాణ ప్రజలు ఇప్పుడు కేసీఆర్ తీరు చూసి ఎమనుకుంటున్నారంటే.. ఎన్నికలొస్తేనే సార్ బయటకు వస్తారన్న ఇంప్రషన్ ఇచ్చేశారు. అందుకే మునుగోడు ఎన్నిక కూడా ఇప్పుడు ప్రజలపై రుద్ధాల్సి వచ్చింది. ఉపఎన్నికలొస్తేనే ఊళ్లకు రోడ్లు వస్తాయని, పింఛన్లు అందుతాయని, పథకాలు వస్తాయని ప్రజలు విశ్వసించేలా చేస్తున్నారు కేసీఆర్. ఇలాంటి కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి ప్రజలకు ఏం చేస్తారు? ఏం ఉద్ధరించడానికి కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారన్న విశ్లేషణలు పెద్ద ఎత్తున సాగుతున్నాయ్? తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసి.. ఆ తర్వాత జాతీయ రాజకీయాల గురించి మాట్లాడితే బాగుటుంది. లేదంటే ఇంకో మాట అనుకోవాలి. తెలంగాణాలో గెలవడం కోసమే మీరు జాతీయ గిమ్ముక్కులను ప్రదర్శిస్తున్నారనుకోవాల్సి ఉంటుంది. కేసీఆర్.. అసలు విషయం చెప్పండి ప్లీజ్..

