కోహినూర్ దక్కేదెవరికి ?
బ్రిటన్‌ను ఏకంగా 70 ఏళ్లపాటు పాలించిన రాణి ఎలిజబెత్ -2, గురువారం 96 ఏళ్ల వయస్సులో ప్రశాంతంగా కన్నుమూశారు.
రాణి మరణంతో ఆమె పెద్దకుమారుడైన వేల్స్ మాజీ యువరాజు ఛార్లెస్ నూతన రాజుగా, కామన్వెల్త్ దేశాలకు అధినేతగా వ్యవహరించబోతున్నారు. ఆయన సతీమణి కెమిల్లాకు రాణి హోదా దక్కబోతోంది.

భారతదేశానికి చెందిన కోహినూర్ వజ్రం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. దీనిని 14 వశతాబ్దంలోనే భారత్‌లో గుర్తించారు. ఈ కోహినూర్ వజ్రం 105.6 కారెట్ల వజ్రం. ఎన్నో చేతులు మారుతూ 1849లో బ్రిటిషర్లు పంజాబ్‌ను ఆక్రమించిన తర్వాత విక్టోరియా రాణి చెంతకు చేరింది ఈ వజ్రం. అప్పటి నుండి వారి వద్దే ఉంది. 1937లో కింగ్ జార్జ్-6 పట్టాభిషేకం సమయంలో ఆయన సతీమణి కోసం రూపొందించిన ప్లాటినం కిరీటంలోనే ప్రస్తుతం ఈ కోహినూర్ ఉంది. దీనిని ఇన్నాళ్లూ క్వీన్ ఎలిజిబెత్ – 2 ధరించారు. ఇప్పడు ఆమె మరణానంతరం ఇది ఎవరికి చేరుతుందనేది ఆసక్తిగా మారింది.

ఇప్పుడు రాజుగా మారిన ఛార్లెస్ రెండవ భార్య కెమిల్లాకు ఈ కిరీటం చేరనుంది. ఈమధ్య ఎలిజబెత్ 70 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా జాతినుద్దేశించి రాణి ఇచ్చిన సందేశంలో తన కోడలు కెమిల్లానే రాణి కావాలని కోరుకుంది ఎలిజబెత్. సాధారణంగా తదుపరి రాణికే కిరీటధారణ జరగనుంది.

అయితే ఈ విషయంలో కొంత అనిశ్చితి నెలకొంది. ఎందుకంటే ప్రిన్స్ చార్లెస్ మొదటి భార్య అయిన ప్రిన్స్ డయానాకు ప్రజల్లో చాలా మంచి పేరు ఉండేది. ఆమె చాలా అందగత్తె. 1996లో చార్లెస్‌తో విడాకులు తీసుకున్న ఏడాదికే ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించింది. మంచి మనస్సు గల ఆమె స్థానంలో కెమిల్లా రావడంతో ప్రజల్లో ఆమెపై వ్యతిరేకత ఉన్నట్లు గత సర్వేల్లో తేలింది. కెమిల్లాకు 2005లో చార్లెస్‌తో వివాహం జరిగింది. ఆమెకు కూడా ఇది రెండో వివాహం. ఈ నేపథ్యంలోనే కెమిల్లాకు రాణి హోదాపై అనుమానాలుండేవి. వీటన్నింటినీ పక్కనబెట్టి తన కోడలు కెమిల్లాకు రాణి హోదా కావాలని ఎలిజబెత్-2 అభిలషించడంతో ఆమెకు రాణి పదవి నిశ్చయమైంది. ఎప్పటినుండో రాజకుటుంబం కిరీటంలో వెలుగులీనుతున్న ఈ వజ్రంపై యాజమాన్యహక్కుకు సంబంధించిన వివాదం భారత్‌తో సహా నాలుగుదేశాల్లో కొనసాగుతోంది.

