InternationalNews

ఎలిజబెత్‌ రాణికి నిజాం నవాబు ఖరీదైన పెళ్లి కానుక

క్వీన్‌ ఎలిజబెత్‌-2 భారత్‌కు మూడుసార్లు వచ్చారు. 1961, 1983, 1997 సంవత్సరాల్లో భారత్‌లో పర్యటించిన ఆమె ఢిల్లీ, ఆగ్రా, చెన్నై, ముంబై నగరాలను సందర్శించారు. తాజ్‌మహల్‌ అందాలను వీక్షించారు. జలియన్‌ వాలా బాగ్‌ దుర్ఘటనపై పశ్చాత్తాపం చెందారు. ముగ్గురు భారత రాష్ట్రపతులకు ఆమె ఆతిథ్యమిచ్చారు. 1963లో డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌, 1990లో వెంకట్రామన్‌, 2009లో ప్రతిభా పాటిల్‌.. క్వీన్‌ ఎలిజబెత్‌ ఆతిథ్యం స్వీకరించిన వారిలో ఉన్నారు.

300 వజ్రాలు పొదిగిన ప్లాటినం హారం

క్వీన్‌ ఎలిజబెత్‌ వివాహం 1947లో జరిగింది. ఈ సందర్భంగా ఆమెకు నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ అత్యంత ఖరీదైన కానుక ఇచ్చాడు. లండన్‌కు చెందిన ప్రముఖ ఆభరణాల తయారీ సంస్థ కార్టయర్‌ ఉద్యోగులను ఎలిజబెత్‌ వద్దకు నిజాం నవాబు పంపించాడు. ఆమెకు నచ్చిన ఆభరణం ఇవ్వాలని వారికి సూచించారు. ధర ఎంతయినా తాను చెల్లిస్తానని మాటిచ్చాడు. వాళ్ల దగ్గర ఉన్నఆభరణాల్లో 300 వజ్రాలు పొదిగిన ప్లాటినం హారాన్ని రాణి ఎంపిక చేసుకుంది. దీని విలువ 66 మిలియన్‌ పౌండ్లు ఉంటుందని అంచనా.

ప్రదర్శనల్లో దర్శనం

ఎంతో ఇష్టంగా తీసుకున్న ఈ నెక్లెస్‌ను క్వీన్‌ ఎలిజబెత్‌ తరచూ ధరించేవారు. బ్రిటన్‌ రాణిగా పగ్గాలు చేపట్టి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ప్లాటినం జూబ్లీ వేడుకల్లో రాణి ఎలిజబెత్‌ యువతిగా ఉన్నప్పటి ఫొటోలను ప్రదర్శించారు. ఆ ప్రదర్శనలో నిజాం నవాబు బహూకరించిన నెక్లెస్‌ను ధరించిన రాణి ఫొటోను సైతం ప్రదర్శించారు. 2014లో జరిగిన నేషనల్‌ పోర్ట్రాయిట్‌ గ్యాలరీ కార్యక్రమంలోనూ, 2019లో జరిగిన డిప్లొమాటిక్‌ కార్ట్ప్స్‌ రిసెప్షన్‌ సందర్భంగా కేట్‌ మిడిల్టన్‌ కూడా ఈ ఆభరణాన్ని ధరించారు. ‘ద క్వీన్స్‌ అక్సేషన్‌’ పేరిట ఏర్పాటు చేసిన ప్రదర్శనలోనూ నిజాం ఏడో నవాబు ఇచ్చిన ఈ ఆభరణాన్ని ప్రదర్శించారు.