News AlertTelangana

ప్రజాకోర్టులో కేసీఆర్‌కి శిక్ష తప్పదు

అసెంబ్లీలో తప్పించుకోవచ్చేమో కానీ ప్రజల చేతిలో టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదన్నారు  బీజేపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి ఈటల రాజేందర్. రెండోసారి అధికారంలోకి వచ్చాక టీఆర్‌ఎస్ ప్రభుత్వం మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోందని ఘాటు విమర్శలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఈటల, రఘునందన్‌రావులు మాట్లాడారు. ప్రజాసమస్యలపై చర్చించాల్సిన శాసనసభ తొలిరోజు కేవలం 5 నిమిషాలు మాత్రమే సాగిందని ఆక్షేపించారు. తమ సమస్యలను సభలో ప్రస్తావించాలని వీఆర్‌ఏలు, వీఆర్వోలు, గిరిజనులు కోరుతున్నారన్నారు. జీతాలు సమయానికి రాక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

శాసనసభ సమావేశాలు ప్రారంభమయినప్పుడు తమ సమస్యలు తెలియజేయాలని అన్ని రంగాలవారు ఎదురుచూస్తూంటారని, ఉమ్మడి ఏపీలో 80 నుంచి 90 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూండేవని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలు కూడా 40- 50 రోజలు కొనసాగుతుండేవన్నారు. సీఎం చెప్పింది తప్ప స్పీకర్ వేరే ఏమీ చేయడంలేదని… ఇప్పుడు ఏ సభా సంప్రదాయాలను పాటించడం లేదని విమర్శించారు. ఇంత తక్కువ రోజులు ఎప్పడూ సమావేశాలు జరుగలేదని ఈటల అన్నారు. స్పీకర్ కేవలం మరమనిషిలా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. బీఏసీని సంప్రదించకుండా 3 రోజులకే పరిమితం చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కేవలం కేసీఆర్ అహంకారమే ఆని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మాట్లాడే అవకాశం ఇస్తే ప్రజాసమస్యలపై మాట్లాడతానని, లేదంటే ప్రజలతో కలిసి పోరాటం చేస్తానని హెచ్చరించారు ఈటల రాజేందర్. ముగ్గురు ఎంపీలు ఉన్నా బీఏసీ సమావేశానికి బీజేపీని ఆహ్వానించలేదని, ఇంతకు పూర్వం ఒక్క ఎమ్మెల్యే ఉన్నా బీఏసీ సమావేశాలకు పిలిచేవారని ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు. గత సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలను అకారణంగా అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారని దుయ్యబట్టారు.