బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం..10 మంది గల్లంతు
బీహార్‌లోని ధన్‌పూర్‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. గంగా నదిలో పడవ బోల్తా పడింది. పశువుల మేతను తీసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పడవలో ఉన్న 55 మంది అకస్మాత్తుగా గంగా నదిలో పడిపోయారు. ఈత వచ్చిన వారందరూ సురక్షితంగా బయటపడగా మరికొందరు గల్లంతయ్యారు. పడవ మునిగిపోవడంతో అంతా నదిలోకి దూకేశారు. అందులో ఈత వచ్చిన వారు ఒడ్డుకు చేరాగా మిగిలిన వారు గల్లంతయ్యారు. చిన్నబోటులో పరిమితికి మించి ప్రయాణించడమే ఈ ప్రమాదానికి కారణమని స్ధానికులు చెబుతున్నారు .

ఈ ఘటనలో 10 మంది ఆచూకీ తెలియలేదు. 45 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరారు. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది నది మొత్తం గాలించారు . ఎంత వెతికినా గల్లంతైన వారి ఆచూకీ లభించలేదు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. రెస్క్యూ టీమ్, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు.రోజులానే కూరగాయలు కోసేందుకు కొందరు.. పశువుల మేత తెచ్చేందుకు మరికొందరు గంగాహర ద్వీపానికి బయలు దేరారు. తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచెసుకుంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. నదీ తీరానికి చేరి కన్నీరు మున్నీరవుతున్నారు.

