రిషిసునాక్‌ను బ్రిటన్ ప్రధాని పదవి వరించనుందా.. ఫలితం కాసేపట్లో
హోరాహోరీగా సాగుతున్న బ్రిటన్ ప్రధానమంత్రి ఎన్నికలకు తెర పడనుంది. ఇంకొద్ది సేపట్లో సస్పెన్స్ వీడి బ్రిటన్ ప్రధానిగా ఎవరు ఎన్నిక కాబోతున్నారనే విషయం బహిర్గతమవుతుంది. బోరిస్ జాన్సన్ తర్వాత వారసుడెవరో తేటతెల్లమవుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఐదు గంటలకు విజేతను ప్రకటిస్తారు. భారత సంతతికి చెందిన రుషి సునాక్ విజయంపై ధీమాగా ఉన్నప్పటికీ, సర్వేలన్నీ కన్జర్వేటివ్ పార్టీ నేతగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తున్నాయి. ఒకవేళ రిషి విజయం సాధిస్తే భారత సంతతికి చెందిన తొలి బ్రిటన్ ప్రధానిగా రికార్డు సృష్టిస్తాడు.
అసలు ఎన్నికల ప్రక్రియ మొదలైన ప్రారంభంలో రిషి ముందంజలోనే ఉన్నారు. ఎంపీల్లో ఆయనకే మద్దతు లభించింది. విదేశాంగ మంత్రిగా ఉన్న ట్రస్ రెండవ స్థానంలో ఉండేవారు. అయితే పార్టీ సభ్యులు వేసే ఆన్‌లైన్, పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ మొదలైనప్పటి నుండీ ట్రస్‌కు ఆధిక్యత పెరుగుతూ వచ్చింది. అధికారంలోకి వస్తే పన్నుల భారాన్ని తగ్గిస్తానని ట్రస్ హామీ ఇవ్వడమే దీనికి కారణంగా చెప్పవచ్చు.

రిషి మాత్రం ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తాననే నినాదంతో ముందుకు వెళుతున్నారు. తాను గెలిస్తే ఇంధన సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటానని వీరిద్దరూ విడివిడిగా ప్రకటించారు.
కన్జర్వేటివ్ పార్టీ ఛైర్మన్ అండ్రూ స్టీఫెన్సన్ మాట్లాడుతూ ఇద్దరు నేతలూ ప్రచారాన్ని చక్కగా నిర్వహించారని, పార్టీ సభ్యులు అడిగిన దాదాపు 600 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఫలితాన్ని ప్రకటించే 10 నిముషాల ముందు మాత్రమే విజేత ఎవరో అనే విషయం వారిద్దరికీ తెలుస్తుందని, అనంతరం వారి కేబినెట్ వివరాలు వెల్లడిస్తారని స్టీఫెన్సన్ తెలియజేశారు.
భారత వ్యాపార దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడైన, భారత సంతతికి చెందిన రిషి సునాక్ విజయం సాధించి, బ్రిటన్ ప్రధానిగా ఎన్నికవ్వాలని ఆశిద్దాం.

