News Alert

అధిక సీట్ల ఆశలు.. అడియాశలేనా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని… ఆశగా ఎదురు చూస్తున్న ఔత్సాహిక రాజకీయ నాయకులలో… ఇప్పటికే ఉన్న రాజకీయ నిరుద్యోగులలో… ఎన్నో ఏళ్లుగా పెట్టుకున్న ఆశలు అడియాశలు అయినట్టేనని అర్థమవుతోంది. ఇటీవల ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం తెలంగాణలో అదనంగా మరో 34 స్థానాలు, ఆంధ్రప్రదేశ్‌లో అదనంగా మరో 50 అసెంబ్లీ స్థానాలు పెరగవలసి ఉంది. దేశంలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉన్న సగటు ఓటర్ల సంఖ్యతో పోల్చితే తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాలలో అధిక ఓటర్లు ఉన్నారు. హైదరాబాద్ నగరంలోని శేర్‌లింగంపల్లి నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 7 లక్షల ఓటర్లకు చేరువకానుంది. కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఎల్బీ నగర్ నియోజకవర్గాల్లో 6 లక్షలకు ఓటర్ల సంఖ్య పెరుగనుంది. ఇలా అధిక సంఖ్యలో ఉన్న ఓటర్లను, ప్రాంతాలను ఒక శాసనసభ్యుడు తన ఐదేళ్ల పదవీ కాలంలో కలవడం సాధ్యం కావడం లేదు. దాంతో 2013 నుంచి ఆ నాటి సీనియర్ శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని ప్రతిపాదించారు. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీలోని అగ్రనేతలందరినీ కలిశారు. పునర్విభజన చట్టాన్ని రచించిన పెద్దలు అందులో ఈ విషయాన్ని పొందుపరిచేటప్పుడు రాజ్యాంగంలోని నిబంధనలను విస్మరించారు. అదే ఇప్పుడు నియోజకవర్గాల పెంపునకు కీలక అడ్డంకిగా మారింది.

రాజ్యాంగంలోని 170 (3) అధికరణం 2031 జనగణన పూర్తయ్యేవరకు దేశంలోని నియోజకవర్గాలను పెంచేందుకు వీలుకాదని స్పష్టంగా చెబుతున్నప్పటికీ… ఆ విషయాన్ని పునర్విభజన చట్టంలో పొందుపర్చేటపుడు రాజ్యాంగ నిబంధన 170తో సంబంధం లేకుండా అని రాయాల్సినవారు అధికరణం 170ని అనుసరించి అని రాయడంతో నియోజకవర్గాల పెంపు అసాధ్యమైనది. పునర్విభజన చట్టాన్ని రూపొందించిన అధికార మేధావులు అనేక తప్పుల తడకగా… దాన్ని రూపొందించారు.


పోలవరం ముంపు మండలాల విషయం, శాసనమండలి స్థానాలను రెండు తెలుగు రాష్ట్రాలకు సమంగా పంచే విషయంలో అధికారులు చేసిన తప్పిదాలు చట్టాల రూపకల్పన ప్రక్రియను అపహాస్యం చేశాయి. ఐతే జమ్ము, కశ్మీర్‌లో జరుగుతున్న నియోజకవర్గాల పెంపునకు రాజ్యాంగంలోని అధికరణ అడ్డురాకపోవడానికి కారణం… దానిని రూపొందించిన అధికారులు, అధికరణ 170 గురించి అందులో ప్రస్తావించకపోవడమే. ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా అధికరణ 170 ప్రస్తావన చేయకుండా ఉన్నట్లయితే తెలుగు రాష్ట్రాలకు ఒక అవకాశం ఉండేది. భారత రాజ్యాంగంలోని అధికరణం 2 లేదా 3 కింద ఏర్పాటైన ఏ చట్టమైనా… రాజ్యాంగంలోని ఇతర అధికరణాలతో విభేదిస్తుంటే… రాజ్యాంగ అధికరణం 368 ప్రకారం అటువంటి చట్టాలను సవరించాల్సిన అవసరం లేదని… రాజ్యాంగంలోని అధికరణం 2 మరియు 3లే అంతిమమని, అధికరణం 4 స్పష్టంగా తెలియజేస్తోంది.

వాస్తవంగాపై అధికరణాన్ని ఉపయోగించుకొని కూడా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచవచ్చు. అలాగే అవిభాజ్య ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాలను ఏదో ఒక నియోజకవర్గంలో కలపాల్సిన అగత్యం ఏర్పడింది. దీని కోసమైనా నియోజకవర్గాలను పెంచకతప్పని పరిస్థితి. సరిగ్గా ఇక్కడే రాజకీయం అడ్డొచ్చింది. ఆ నాటి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రాష్ట్రాన్ని విభజించి చట్టాలు సరిగా చేశారో లేదో చూసుకునే సమయం కూడా… ఇవ్వకపోవడం ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీకి వరమైంది. 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కేసీఆర్‌లు కేంద్రంలోని బీజేపీ పెద్దలను నియోజకవర్గాలను పెంచమని పదేపదే కోరినప్పటికీ వీరికి ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు వకాల్తా పుచ్చుకొని కేంద్ర పెద్దలతో మాట్లాడినప్పటికీ… ఆనాటి కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆనాడు బలహీనంగా ఉన్న బీజేపీ నియోజకవర్గాలను పెంచితే వారి పార్టీలో ఉన్న ఆ కొద్దిమంది బలమైన నాయకులు కూడా అవకాశం వచ్చి పక్క పార్టీల్లోకి వెళ్లిపోతారనే భయం, ఆనాటి ప్రతిపక్షపార్టీలు పూర్తిగా నిర్వీర్యమైపోతాయనే కారణంతో ఆనాడు ఒప్పుకోలేదు. అప్పటి నుండి అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ నియోజకవర్గాలను పెంచమని అడుగుతూనే ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం దీనికి సుముఖంగా లేదు. అధికరణం 170ని అనుసరించి 2031 జగగణన తర్వాత నియోజకవర్గ పునర్విభజన సంఘాన్ని నియమిస్తే ఆ సంఘం నివేదిక రావడానికి రెండు మూడు సంవత్సరాల సమయం పడుతుంది. అనగా 2034 సాధారణ ఎన్నికల వరకు నియోజకవర్గాల పెంపు అసాధ్యమని స్పష్టమవుతుంది. దీంతో నియోజకవర్గాలు పెరిగితే పోటీ చేయాలనుకున్న ఔత్సాహికులు నిరుత్సాహపడుతున్నారు. ప్రస్తుతం నియోజకవర్గాల పెంపుపై దృష్టిపెట్టకుండా ప్రజా సమస్యలపై దృష్టిపెడితే అటువంటి నాయకులు కనీసం పదీ, పన్నెండు సంవత్సరాల తర్వాత అయినా చట్టసభల్లోకి అడుగుపెట్టవచ్చు.