5 రాజధానులు అవసరమే..
దేశంలో ప్రాంతీయ, ఆర్ధిక అసమానతలు తొలగించాలంటే భారత్‌కు ఐదు రాజధానులు ఉండాలని తాను నమ్ముతున్నట్టు అస్సామ్ ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ట్విట్టర్లో పేర్కొన్నారు. అభివృద్ధిలో సమతూకం సాధించేలా, దేశంలోని ప్రతి జోన్‌లో ఒకటి చొప్పున రాజధాని ఏర్పాటు చేయడంపై అందరూ పనిచేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాలను అవహేళన చేయడం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు అలవాటుగా మారిందని హింత బిశ్వశర్మ మండిపడ్డారు. రాజధానులను వికేంద్రీకరిస్తే..
ఢిల్లీ లాంటి ఒకేచోట మొత్తం సంపద పోగుపడటం ఉండదని అస్సామ్ సీఎం ట్వీట్ చేశారు. 70 ఏళ్లుగా నిర్లక్ష్యం చేయబడిన ఈశాన్య రాష్ట్రాలను జాతీయ జీవన స్రవంతిలో కలిపేందుకు 2014 తర్వాత ప్రధాని మోదీ చర్యలు తీసుకున్నారని హిమంత బిశ్వశర్మ ప్రశంసలు కురిపించారు.

ఢిల్లీ, అస్సామ్ ముఖ్యమంత్రుల మధ్య కొంతకాలంగా ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. అస్సామ్‌లో సున్నా ఫలితాలు సాధిస్తున్న స్కూళ్లు మూసివేస్తున్నారని..బడుల మూసివేత సమస్యకు పరిష్కారం కాదని ఇటీవల ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన అస్సామ్ సీఎం తమ రాష్ట్రంలో 44వేల 521 ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని తెలిపారు. 65లక్షల మందికి పైగా గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకుంటున్నారని బదులిచ్చారు. ఢిల్లీలోని 1000కి పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే అస్సామ్‌లోని పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య , స్థితిగతులు ఎంతో మెరుగ్గా అన్నాయని ఆయన రీ ట్వీట్ చేశారు. మరో సందర్భంలో అస్సామ్‌లో అమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే తాము ఢిల్లీ తరహాలో అభివృద్ధి చేస్తామని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. దీనిపై బిశ్వంత్ శర్మ ధీటుగా స్పందించారు, ఢిల్లీని లండన్ , పారిస్ తరహాలో అభివృద్ధి చేస్తానన్న కేజ్రీవాల్ ఆ సంగతి మర్చిపోయారా? అని హిమంత శర్మ ప్రశ్నించారు. శతాబ్దాలుగా అభివృద్ధి చెందిన ఢిల్లీని.. దశాబ్దాలుగా నిరాదరణకు గురైన ని ఈశాన్య రాష్ట్రాలను ఓకే గాటన కడుతున్న వైనంపై మండిపడ్డ ఆయన ఈశాన్య భారతానికి ఎవరి సానుభూతి అవసరం లేదని అన్నారు. ఈ కోవలోనే దేశానికి ఐదు రాజధానులుంటే అసమానతలు ఉండవని..సంపద మొత్తం ఒకే చోట పోగుపడే పరిస్థితులు రూపుమాసి పోతాయని ట్వీట్ చేసి అస్సామ్ సీఎం కొత్త చర్చకు తెరతీశారు . ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన వికేంద్రీకరణ, 3రాజధానుల అంశం రాజకీయ వేడి పుట్టిస్తున్న తరుణంలో..ప్రాంతీయ, ఆర్ధిక అసమానతలకు రాజధానుల వికేంద్రీకరణ సరైన పరిష్కారం అన్న రీతిలో అస్సామ్ సీఎం వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
