పెళ్లైన 9 రోజులకే భర్త మృతి.. భార్యకు తీవ్రగాయాలు
పెళ్లి చేసి కూతురిని అత్తారింటికి సంతోషంగా పంపిన తల్లితండ్రులు.. ఒక్కగానొక్క కొడుకు.. ఇరవై ఏళ్లకు పుట్టిన కుమారుడికి ఘనంగా పెళ్లి చేశామని ఆనందంలో ఉన్న తల్లితండ్రులు.. అండగా ఉంటాడనుకున్న కొడుకు అంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఆనుకోని రోడ్డు ప్రమాదం ఇరు కుటంబాల్లో ఉహించని విషాదాన్ని నింపింది. కాళ్లకు పెట్టిన పారని ఆరకముందే.. పెళ్లై పట్టుమని 16 రోజులు కూడా గడవకుండానే కాలం చెల్లాడు తమ కుమారుడు. కోడలు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఏకైక కుమారుడి మరణం ఆ తల్లితండ్రులకు తీరని శోకం మిగిల్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన ములకపల్లి రాములు-మైసమ్మ కొన్నాళ్లుగా హైదారాబాద్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తూ.. కుమారుడు వీరభద్రం(26)ను చదివించుకుంటున్నారు. ఏడాది క్రితం తమ సొంత గ్రామమైన ఆత్మకూరుకు వెళ్లారు. వీరభద్రం మేనమామ అయిన సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం అనాజిపురంకు చెందిన సైదులు- విజయ దంపతుల కుమార్తె ప్రణీతతో ఈ నెల 21న వివాహం జరిగింది. ఇంతలోనే ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రణీత తల్లిదండ్రులు కూడా హైదరాబాద్ లోనే ఉంటారు. వీరభద్రం హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్ లో ఉన్న రిలయన్స్ జియో డిజిటల్ స్టోర్ లో పనిచేస్తున్నాడు.

వివాహానికి వారం రోజులు ముందు సెలవు తీసుకున్నాడు. వివాహం పూర్తయి వారం రోజులు కావటంతో తిరిగి విధుల్లో చేరడానికి తన భార్య ప్రణీతను తీసుకొని సోమవారం బైక్‌పై హైదరాబాద్‌కు బయల్దేరాడు. చౌటుప్పల్ మండలం పతంగి టోల్‌ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై బైక్ అదుపు తప్పి టోల్‌గేట్‌ను ఢీకొట్టడంతో వీరభద్రంకు తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య ప్రణీత చికిత్స పొందుతోంది. వీరభద్రం మృతదేహానికి పోస్టుమార్టం చేసి చౌటుప్పల్‌లోని ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉంచారు.

