నాగార్జున 63 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా
తెలుగు సీనియర్ నటుడు నాగార్జున నేటితో 63 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 1959 ఆగస్ట్ 29న జన్మించిన నాగర్జున ఈ వయసులోనూ చూడ్డానికి కుర్రోడి మాదిరిగా, చలాకీగా కనిపిస్తుంటారు. నటనతోపాటు, బిగ్ బాస్ సహా ఎన్నో షోలను విజయవంతంగా నిర్వహించారు. అందరికి వృద్ధాప్యం సహజం దాన్ని ఆపడం ఎవరితరం కాదు. వయసు మీద పడుతుంటే ఆ ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి.
కానీ, నాగార్జున విషయంలో మాత్రం ఇది పూర్తిగా భిన్నమనే చెప్పోచ్చు. ఆయన్ను చూసిన వారు అంత ఆరోగ్యం, యవ్వనం ఎలా సాధ్యం? అని అనుకుంటూ ఉంటారు. ఫిట్ నెస్ అంటే ఆయనకు చాలా ఇష్టం.. ఇప్పటికీ నిత్యం వ్యాయామం చేయాల్సిందే. ఆయన భార్య అమల కూడా ఫిట్ నెస్ కు ప్రాధాన్యం ఇస్తారు. అందుకే ఈ దంపతులకు అంత వయసు వచ్చినా చూడ్డానికి అలా కనిపించరు.
‘‘ఏంటి సార్ మీ ఆరోగ్య రహస్యం? ఇప్పటికీ శరీరాన్ని అలా స్లిమ్ గా, షైనీగా ఎలా ఉంచుకోగలుగుతున్నారు?’’ అంటూ టీవీ కార్యక్రమాల సందర్భంగా నాగార్జున ప్రశ్నలు అడుగగా.. ఆయన తన ఆరోగ్య రహస్యం ఏంటో కూడా చెప్పారు.

నాగార్జున దినచర్య ఉదయం 6 గంటలకు మొదలవుతుంది. గంటపాటు జిమ్ లో గడుపుతారు. ఆ తర్వాత గుడ్డులో తెల్లసొన, బ్రెడ్ తో కలిపి తీసుకుంటారు. తిరిగి ఉదయం 11 గంటల సమయంలో దోశ లేదా పొంగల్ లేదా ఇడ్లీ తింటారు. మధ్యాహ్నం లంచ్ లో రైస్, రోటి, నాలుగు రకాల కూరలు తింటారు.

లంచ్ కు ముందు పండు తీసుకుంటారు. తిరిగి రాత్రి 7 గంటల సమయంలో డిన్నర్ పూర్తి చేస్తారు. ఉడకబెట్టిన కూరగాయలు, గ్రిల్డ్ చికెన్ లేదా చేపలతో కలిపి తీసుకుంటారు. ఇవే కాక ఎట్టి పరిస్థితిలో రాత్రి 10 గంటలకు ఆయన నిద్రపోవాల్సిందే. ఆరునూరైనా వారంలో ఆరు రోజులు వ్యాయామాలు చేయాల్సిందే. తను అంత ఫిట్‌గా ఉండేందుకు వీటిని క్రమం తప్పకుండా పాటిస్తానని అన్నారు.