NationalNews

బీజేపీ హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది-కర్నాటక సీఎం

బీజేపీ తనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందని బసవరాజ్ బొమ్మై అన్నారు. కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి నాయకత్వం తనే వహిస్తారని బీజేపీ ఇప్పటికే పేర్కొందని చెప్పారు. ఓవైపు పార్టీ, మరోవైపు సీఎం మొత్తం వ్యవహారంపై ఫుల్ క్లారిటీ ఇస్తున్నప్పటికీ… కర్నాటకలో సీఎం మార్పుపై చర్చ మాత్రం అలాగే కొనసాగుతోంది. ఆ నేపథ్యంలో ఓ ఆంగ్ల చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బొమ్మ మొత్తం వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పను ఎలాంటి వార్నింగ్ లేకుండానే ఎలా తొలగించారని… మీ భవిష్యత్ ఎలా ఉండబోతుందన్న ప్రశ్నకు బదులిచ్చిన ఆయన ప్రతి రోజూ సండే కాదని బదులిచ్చారు.

సీఎంగా పార్టీని బలోపేతం చేసేందుకు, నిర్ణయాలు తీసుకోడానికి తనకు హైకమాండ్ స్వేచ్ఛ ఇచ్చందని స్పష్టం చేశారు. తాను యడ్యూరప్ప తోలుబొమ్మను కానన్న బొమ్మై… ఆయన స్ఫూర్తితో సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని తేల్చి చెప్పారు. యడ్యూరప్ప ప్రభుత్వంలో రోజువారీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోరన్నారు. యడ్యూరప్ప మాస్ లీడర్ అని… పాలనలో ఆయన సహకరిస్తారని అంత మాత్రాన రోజువారీ వ్యవహారాల్లో యడియూరప్ప జోక్యం చేసుకోరన్నారు. కర్నాటకలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయ్.

తాను మత హింసను ఎంత మాత్రం ఆమోదించనన్న బొమ్మై… కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హిందువులపై దాడులకు ప్రతిగానే ప్రస్తుతం కొన్ని చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయని… సమాజంలో ఉన్న కోపం, అశాంతి అందుకు కారణమన్నారు. శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు ప్రయత్నించే వారిపై ఉక్కుపాదం మోపుతానన్న ఆయన తాను మొత్తం వ్యవహారంపై అంపైర్‌గా వ్యవహరిస్తానన్నారు. త్వరలో ముస్లిం బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శిస్తానని ఆయన చెప్పారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మతమార్పిడి నిరోధక చట్టాన్ని సమర్థించుకున్న బొమ్మై… రాష్ట్రంలో పెద్ద ఎత్తున అక్రమ మత మార్పిడులు జరుగుతున్నాయని, అధికార పార్టీ ఎమ్మెల్యే తల్లిని సైతం క్రైస్తవ మతంలోకి మార్చారని తెలిపారు.

కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకోవడంతో మంత్రి పదవికి కెఎస్ ఈశ్వరప్ప రాజీనామా చేశారని… అవినీతి ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని, అవినీతి ఆరోపణలు చేస్తున్న కాంట్రాక్టర్లకు కాంగ్రెస్ మద్దతు ఉందని, నైతిక కారణాలతో మంత్రి పదవికి రాజీనామా చేశారని తెలిపారు. బీఎస్ యడ్యూరప్ప నుంచి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన బసవరాజ్ బొమ్మై జూలై 28వ ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు.