మంగళగిరిలో వేడెక్కిన రాజకీయం
◆ ముఖ్యమంత్రిని కలిసిన కాండ్రు కమల
◆ మంగళగిరి అదనపు సమన్వయకర్తగా నియామకమని జోరుగా ప్రచారం
◆ తాడోపేడో తెల్చుకోవడానికి సిద్ధమైన దొంతి రెడ్డి వేమారెడ్డి, మున్నంగి గోపిరెడ్డి
◆ ఆర్కేకు మళ్లీ సీటు ఇస్తే ఓడిస్తామంటున్న అసమ్మతినేతలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న పెడన నియోజకవర్గంలో బటన్ నొక్కి రాష్టవ్యాప్తంగా 80వేల పైచిలుకు చేనేత కార్మికులకు నేతన్న నేస్తం పథకం నాలుగోవిడత నిధులు 193.31 కోట్లు జమచేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ముఖ్యమంత్రిని కలవడం వెనుక ఆంతర్యం ఏదైనప్పటికీ చేనేత కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన మంగళగిరిలో మాత్రం ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. వివిధ సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి నీ కాండ్రు కమల కలిసిన ఫోటోలు హల్చల్ కావడంతో కాండ్రు కమలను మంగళగిరి నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా నియమిస్తారనే ప్రచారం మంగళగిరిలో జోరు అందుకుంది.

2019 ఎన్నికలకు ముందు అప్పటి అధికార టీడీపీలో చేరిన కమల.. కొద్ది రోజుల తర్వాత పత్రిపక్ష వైసీపీలో చేరి సంచలనం సృష్టించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ టికెట్ చేనేతలకే అంటూ ప్రచారం సాగుతూ వచ్చి చివరికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీచేయడం, గెలవడం తెలిసిందే. ఆ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కమల అధికార పార్టీలో ఉన్నప్పటికీ కాలక్రమంలో ఆ పార్టీ కార్యక్రమాలకు దూరమవడం అదేవిధంగా నియోజకవర్గంలో ముఖ్య నాయకులు స్తబ్దుగా ఉండిపోయారనేది ఆయా నేతల ఆంతరంగిక సంభాషణలను బట్టి తెలుస్తోంది. అప్పటికే వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న చేనేత నేత చిల్లపల్లి మోహనరావు ఆప్కో చైర్మన్ పదవిని 2020 డిసెంబరు 30న ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా అలంకరించారు. రాజధాని కీలక నగరిగా ఉన్న మంగళగిరిలో ప్రజాప్రతినిధికి, ఆప్కో చైర్మన్ కు అంతగా సఖ్యత లేదనడానికి ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు తేటతెల్లం చేశాయి.

ఇక గతేడాది చివరలో మాజీ మంత్రి, చేనేతల్లో పెద్దాయనగా గుర్తింపు పొందిన మురుగుడు హనుమంతరావు టీడీపీకి రాజీనామా చేయడం అధికార పార్టీలో చేరకుండానే కొద్దినెలలకే ఉమ్మడి గుంటూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం విశేషం. హనుమంతరావుకు ఎమ్మెల్సీ టికెట్ రావడం అందుకు తెరవెనుక ఎవరు కృషిచేశారనేది ఇప్పటికీ పూర్తిస్థాయి స్పష్టత వెలుగుచూడలేదు. అయితే, ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాల్సి ఉంది. మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ టికెట్ ఖరారు కాగానే అధికార పార్టీ పట్టణ అధ్యక్షుడుగా ఉన్న మునగాల మల్లేశ్వరరావు ఎమ్మెల్యేపైన, మురుగుడుపైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. అందుకు వెంటనే ఆ నాయకుడిపై వేటు పడుతుందని విశ్లేషకులు భావించారు. అందుకు భిన్నంగా కొన్నాళ్లకు మునగాల సతీమణి భాగ్యలక్ష్మికి మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పదవిని కట్టబెట్టడం గమనార్హం. ఈ పరిస్థితులను బట్టి రాజకీయ వ్యూహరచన ఎంత గుట్టుగా సాగుతుందో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక ఇటీవలి కాలంలో చేనేత సామాజిక వర్గానికి చెందిన మరో బలమైన నేత గంజి చిరంజీవి తనను అందలం ఎక్కించిన తెలుగుదేశం పార్టీలో గుర్తింపు కరువైందని… ఇది చేనేతల పట్ల చిన్నచూపుగా ఆరోపణలు చేస్తూ మీడియా సమావేశం పెట్టిమరీ తన బాధను వెళ్లగక్కారు. అయితే అంతకుముందుగానే రాయలసీమకు చెందిన రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ వెంటరాగా ముఖ్యమంత్రి జగన్ ను కలిసినట్టుగా విస్తృత ప్రచారం సాగింది. ఇక చిరంజీవి అధికార పార్టీ తీర్థం తీసుకోవడమే తరువాయి అనుకుంటున్న నేపథ్యంలో ఆ పార్టీలో చేరకుండానే స్థానిక ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు కూడా చేశారు.

ఇక తాజాగా, పెడనలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతన్న నేస్తం పథకం నాలుగో విడత కార్యక్రమంలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల తళుక్కుమనడం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం చకచకా జరిగాయి. మొన్నామధ్య మంగళగిరిలో జరిగిన వైసీపీ నియోజకవర్గ ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని మరోసారి గెలిపించుకుని హ్యాట్రిక్ సాధిస్తామని పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహం వ్యక్తపరిచాయి. ఇదిలావుండగా చేనేతలకు కేంద్రబిందువుగా ఉన్న మంగళగిరిలో చేనేత నాయకులుగా పదవులను అలంకరించిన మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల, కాండ్రు శ్రీనివాసరావు, గంజి చిరంజీవి, చిల్లపల్లి మోహనరావు.. వీరందరూ వైసీపీలో ఉన్నట్టుగానే భావించవచ్చు. అయితే, ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే.. ఏ ఇద్దరి నాయకుల మధ్యా సఖ్యత లేదనడానికి ఆయా సందర్భాల్లో చోటుచేసుకున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయి.

కాబట్టి రేపటి ఎన్నికల్లో చేనేతలకే టిక్కెట్ అనేది ఎండమావి కాకుండా ఉండాలంటే అందరూ కలిసికట్టుగా ఉండి సరైన ప్రణాళికలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదిలా ఉంటే రాజకీయ మనుగడ కొసం మంగళగిరిలో వైసీపీ అసమ్మతి నేతల పోరుబాట పట్టారు. ఆ నియోజకవర్గంలో ఎప్పటి నుండో బలమైన నేతలుగా పేరున్న దొంతిరెడ్డి వేమారెడ్డి, మున్నంగి గోపిరెడ్డిలు తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆర్కేకు మళ్లీ సీటిస్తే అదిష్టానంకు చెప్పి మరి ఓడిస్తాం అని కొంతమంది అసమ్మతి నేతలు అంటున్నారు. ఏదేమైన రానున్న రోజుల్లో మంగళగిరి వైసీపీలో పెనుమార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గం హీటెక్కింది. రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌గా కూడా మారింది, రానున్న ఎన్నికల్లో మరి జగన్ ఎవరికి టికెట్ కేటాయిస్తారో…