NationalNews

గందరగోళంగా బీహార్ అసెంబ్లీ సమావేశాలు

అరుపులు .. కేకలు .. గందరగోళం మధ్యబీహార్ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఆర్జేడీ నేతలను టార్గెట్ చేసుకుని ఈడీ, సీబీఐ దాడులు నిర్వహించడాన్ని ఆర్జేడీ నేత, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. కీలక నేతల ఇళ్ళపై దర్యాప్తు సంస్ధలు దాడులు నిర్వహించడం బీహార్ రాజకీయాలలో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. తమ వెంట ఉన్న శాసన సభ్యులను భయభ్రాంతులు గురి చేసేందుకే ఇలా చేస్తున్నారంటూ తేజస్వీ యాదవ్ బీజేపీపై నిప్పులు చెరిగారు. వారి దాడుల్లో ఏ ఆధారాలు సేకరించారంటూ ప్రశ్నించారు. ఈ అంశం అసెంబ్లీని కుదిపేసింది.

అక్రమ మైనింగ్ .. భూ ఆక్రమణలు.. రైల్వే ఉద్యోగ నియామకాల్లో జరిగిన కుంభకోణానికి సంబంధించిన కేసులో సీబీఐ దూకుడు పెంచింది. లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖా మంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ భూములను లంచంగా తీసుకుని రైల్వేలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చిన కుంభకోణంలో సీబీఐ ఇప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇటు బీహార్ తో పాటు అటు జార్ఖండ్ లో కూడా పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నారు. జార్ఖండ్‌ అధికార పార్టీ ప్రతినిధి పంకజ్ మిశ్రాను ప్రశ్నించిన తర్వాతే .. ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు సీబీఐ అధికారులు చెబుతున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ కు అత్యంత సన్నిహితునిగా పేరున్న ఆర్జేడీ నేత సునీల్ సింగ్ ఇంట్లో ముందుగా దాడులు నిర్వహించారు. ఆయన ఆర్జేడీ పార్టీకి కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఆర్జేడీ ఎంపి అష్పక్ కరీమ్ నివాసంలో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ వ్యవహారాన్ని అసెంబ్లీ వేదికగా ఆర్జేడీ కడిగి పారేసింది. కావాలనే తమ నాయకుల ఇళ్ళపై దర్యాప్తు సంస్ధలను ఉసిగొలిపి .. దాడులు చేయిస్తున్నారని తేజస్వీ యాదవ్ మండి పడుతున్నారు.

ఎన్.డీఏ నుండి బయటకు వచ్చాక నితీష్ కుమార్ ఆర్జేడీతో జత కట్టారు. కాంగ్రెస్ తో పాటు మరికొన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందే స్పీకర్ విజయకుమార్ సిన్హా తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం తీవ్ర ఆసక్తిని రేపింది. అంతకు ముందు వరకు తాను స్పీకర్ పదవికి రాజీనామా చేసేదే లేదంటూ బీజేపీకి చెందిన విజయకుమార్ సిన్హా భీష్మించుకు కూర్చున్నారు. అయితే అకస్మాత్తుగా రాజీనామా చేయడం వెనుక ఆంతర్యం ఎవరికీ అంతుబట్టలేదు.