మునుగోడులో పరిగెత్తేందుకు రెడీ అవుతున్న కాంగ్రెస్
అందరి అడుగులు వేగంగా పడుతున్నాయి. కానీ.. కాంగ్రెస్ మాత్రం మందకొడిగా నడక సాగిస్తోంది. ఇప్పటికే ప్రజాదీవెన, సమర భేరీల పేరుతో టీఆర్ఎస్.. బీజేపీలు భారీ సభలు నిర్వహించగా.. కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరుకు మీనమేషాలు లెక్క పెడుతూనే ఉంది. ఇక పరుగు పెట్టక పోతే అసలుకే ప్రమాదం ఏర్పడుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో మంగళవారు ఢిల్లీలో మునుగోడు ఉప ఎన్నికపై అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించబోతున్నారు. ఎన్నికల కంటే ముందు నేతల మధ్య ఏర్పడ్డ విబేధాలను పరిష్కరించి .. ఐక్యతగా ముందుకు కదిలేట్టు చూడాలని భావిస్తున్నారు. ఈ సమావేశంలో ఎఐసీసీ నేతలు ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ, కే.సీ వేణు గోపాల్, మాణిక్యం ఠాకూర్ తో పాటు తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన ముఖ్య నేతలంతా హాజరవుతున్నారు. ఉప ఎన్నికల వ్యూహంతో పాటు నేతల మధ్య సమన్వయానికి చెందిన అంశాలను ప్రధానంగా చర్చించబోతున్నారు.

ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు అనుసరిస్తున్న వైఖరిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి తదితరులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ అనుసరిస్తున్న విధానాలు, సీనియర్ల పట్ల ఆయన చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి, నోటి దురుసు తనం, పట్టీపట్టని వైఖరి తదితర అంశాలను అధిష్టానం దృష్టికి కూడా తీసుకు వెళ్ళారు. ఈ నేపధ్యంలో మంగళవారం జరగనున్న సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మునుగోడులో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్ధిపై కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశాక.. పార్టీని వదిలి వెళ్ళిపోతున్న నేతల సంఖ్య బాగా పెరిగింది. దీనిపై కూడా దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి.

మునుగోడు కాంగ్రెస్ కు సిట్టింగ్ స్ధానం. ఇక్కడ తప్పని సరిగా గెలిచి తమ బలాన్ని నిరూపించుకోవాలని ఆ పార్టీ కృత నిశ్చయంతో ఉంది. ఏఐసీసీ కూడా ఈ స్ధానంలో విజయం పట్ల సీరియస్ గా ఉంది. పార్టీలో రగులుతున్న తీవ్ర అసంతృప్తిని చల్లబరిచి అందరినీ కలుపుకు పోయేలా చర్యలు తీసుకునేందుకు ఎఐసీసీ దృష్టి పెట్టింది. ముఖ్యంగా మునుగోడు వ్యవహారంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

