NationalNews AlertTelangana

రామోజీ ఓ స్ఫూర్తి ప్రదాత .. అమిత్ షా ప్రశంసలు



అక్షర యోధునితో అపర చాణుక్యుని భేటీ ఆసక్తి రేపింది. మునుగోడు సభతో పాటు రామోజీరావు, జూనియర్ ఎన్టీఆర్ లతో అమిత్ షా జరిపిన ప్రత్యేక సమావేశాలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దక్షిణాదిపై గురి పెట్టిన బీజేపీ .. తెలంగాణలో అధికారం కోసం ఉవ్వెళ్ళూరుతోంది. ఈ క్రమంలో అనేక వ్యూహాలను రచిస్తోంది. ఈక్రమంలోనే వివిధ అంశాలపై విశేష అనుభవం ఉన్న రామోజీరావుతో సమావేశం అయ్యారా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మునుగోడు సభ అనంతరం రోడ్డు మార్గంలో హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళారు. అక్కడ ఆయనకు రామోజీరావు సాదర స్వాగతం పలికి లోపలికి తీసుకు వెళ్ళారు. ఇంట్లో కొన్ని చిత్రాలు అమిత్ షాను ఎంతో ఆశ్చర్యపరిచాయి. వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇద్దరూ కొద్దిసేపు ఏకాంత చర్చలు జరిపారు. వీరిద్దరి భేటీలో పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అసలు ఈ సమావేశం వెనుక ఉద్దేశం ఏమిటన్నదే అందరినీ ఉత్కంఠకు గురి చేస్తోంది.


మీడియా రంగంలో రామోజీరావుది ఓ ప్రత్యేక స్ధానం. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో ఆయన ప్రభావం బలీయంగా ఉంది. అనేక వ్యాపార సంస్ధలూ ఉన్నాయి. ముఖ్యంగా సినీ రంగంతో ఆయనకు ఉన్న సంబంధం బలీయమైనది. రాజకీయంగా ఎన్నో పార్టీలను చూశారు. అక్షరాన్నే ఆయుధంగా చేసుకుని ప్రభుత్వాలను కదిలించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే సామాజిక కార్యక్రమాలకు ఊపిరి పోశారు. సారా వ్యతిరేక ఉద్యమాలు లాంటి అనేక ఉద్యమాలకూ ఊతం ఇచ్చారు. ఓ కదలిక తెచ్చారు. అలాంటి స్ఫూర్తిప్రదమైన, మార్గదర్శకమైన వారితో అమిత్ షా సమావేశం కావడం వెనుక ఆంతర్యం ఏమై ఉండొచ్చు అన్నదే ఆసక్తి రేపుతున్న అంశం. రానున్న ఎన్నికల్లో పరిస్ధితులు ఎలా ఉండబోతున్నాయి? ఎవరికి ఎలాంటి బలం ఉంది ? మీడియా వర్గాల భావన ఏమిటి? అన్న అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.


రెండు తెలుగు రాష్టాల్లో నెలకొన్న రాజకీయ పరిస్ధితులు గురించి అమిత్ షా తో విపులంగా రామోజీరావు చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే రానున్న ఎన్నికల్లో ఎవరితో కలిసి పని చేస్తే.. లాభం ఉంటుంది అన్న అంశాన్ని కూడా రామోజీరావు దగ్గర అమిత్ షా ప్రస్తావించినట్లు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో రాజకీయ అంశాలపైనే ఎక్కువగా ఇద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు 45 నిమిషాల పాటు ఇద్దరు భేటీ అయ్యారు. అమిత్ షాతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఫిల్మ్ సిటీకి వెళ్ళినా .. సమావేశం మాత్రం ఇద్దరి మధ్యనే జరగడం విశేషం. అనంతరం అమిత్ షా విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నోవాటెల్ హోటల్ లో జూనియర్ ఎన్టీఆర్ ను కలుసుకున్నారు. ఆ తర్వాత అమిత్ షా ట్విట్టర్ లో స్పందిస్తూ ఎన్నో లక్షల మందికి రామోజీరావు స్ఫూర్తిదాయకంగా ఉన్నారని.. ఆయన జీవన ప్రస్తానం ఎంతో అపురూపమైనదంటూ ట్వీట్ చేశారు. ఆయనను కలసుకోవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు అమిత్ షా.