కేసీఆర్ బహిరంగ సభ.. టీఆర్ఎస్ అభ్యర్థిపై ఉత్కంఠ
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించి భవిష్యత్తులో ఎన్నికలకు పట్టు సాధించాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి ఈ ఉప ఎన్నిక అత్యంత కీలకంగా మారింది. వచ్చే ఎన్నికలకు ముందు జరగనున్న ఈ ఉప ఎన్నిక పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికపై దృష్టి సారించారు.
రేపు (శనివారం) రోజున మునుగోడులో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభా వేదికగా సీఎం కీలక ప్రకటన చేయనున్నారు. ఈ వేదిక పై నుంచే తమ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు ఇటీవలే జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ హింట్ ఇచ్చారు. కేసీఆర్ ప్రకటన కోసం పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.
మరోవైపు.. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు.. సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 3 లక్షల మందితో సభ నిర్వహించేలా గులాబీ శ్రేణులు పని చేస్తున్నాయి. ఇప్పటికే మండలాల వారిగా పార్టీ శ్రేణులకు బాధ్యతలు కూడా కేటాయించారు.

