అన్నాడీఎంకే అధికార పోరులో పళనిస్వామికి కోర్టులో భారీ ఎదురుదెబ్బ
అన్నాడీఎంకే నాయకత్వం వ్యవహరంలో పళనిస్వామికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన నియామకం చెల్లదని మద్రాసు హైకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. పళనిస్వామితో తీవ్ర అధికార పోరులో చిక్కుకున్న పన్నీర్‌సెల్వంకు ఈ తీర్పుతో భారీ ఊరట లభించింది. అన్నాడీఎంకే నాయకత్వం విషయంలో, జూన్ 23న జనరల్ బాడీలో తీసుకున్న నిర్ణయాలపై మద్రాసు హైకోర్టు స్టే విధించింది. పార్టీ జనరల్ సెక్రెటరిగా ఇ. పళనిస్వామి నియమకం చెల్లదని స్పష్టం చేసింది. దీంతో పళని స్వామికి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టయింది. ముందు ఉన్న స్థితిని న్యాయస్థానం ఆదేశించింది — అంటే పన్నీర్‌సెల్వం కోఆర్డినేటర్‌గా, పళనిస్వామి డీప్యూటీ జాయింట్ కోఆర్డినేటర్‌గా గా కొనసాగాల్సి ఉంటుంది. అన్నాడీఎంకే కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత మద్రాస్ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా జూన్ 23న నిర్వహించిన జనరల్ బాడీ సమావేశం పార్టీ నిబంధనలను అతిక్రమించి పళనిస్వామి ఏర్పాటు చేశారని పన్నీరు సెల్వం తరఫు న్యాయవాది ఆరోపించారు. జనరల్ బాడీ సమావేశం సంయుక్తంగా ఇరువురి నేతల సమక్షంగా చేపట్టాలని వెల్లడించారు. ‘పార్టీ మధ్యంతర జనరల్ సెక్రెటరీగా పళనిస్వామి నియామకం సరైంది కాదని ఇరువురు నేతలు కలిసి పనిచేయాలని పన్నీర్‌సెల్వం తరఫు న్యాయవాది తమిల్‌మారన్ పేర్కొన్నారు.

దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కోర్టు శిక్షల నేపథ్యంలో పదవీవిరమణ చేయాల్సి వచ్చినప్పుడు రెండుసార్లు పన్నీర్‌సెల్వం ను అత్యున్నత పదవికి ఎంపిక చేశారు. జయలలిత మరణానికి ముందు ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆమె మరణానంతరం కొద్దికాలం పాటు పార్టీని నడిపించిన ఆమె సన్నిహితురాలు శశికళ ముఖ్యమంత్రి పీఠానికి పళనిస్వామి ని ఎంపిక చేశారు. మరోవైపు.. శశికల ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే ప్రయత్నాలు చేయగా పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత శశికళ బెంగళూరు జైలులో ఉన్నప్పుడు ఇరువురు నేతలు కలిసి పార్టీని నడిపించారు. పన్నీర్ సెల్వంతో చేతులు కలిపిన పళనిస్వామి పార్టీ నేత శశికలను బహిష్కరించారు. పన్నీర్ సెల్వంను ఉపముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు పళని స్వామి. పన్నీర్ సెల్వం కోఆర్డినేటర్‌గా, పళనిస్వామి డిప్యూటీ జాయింట్ కోఆర్డినేటర్‌గా కొనసాగుతూ వచ్చారు. అయితే…ఉమ్మడి నాయకత్వంలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమిపాలవటంతో నేతల మధ్య విబేధాలు బయటపడ్డాయి. పార్టీని హస్తగతం చేసుకునేందుకు ఉమ్మడి నాయకత్వంతో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నామని పళనిస్వామి పేర్కొన్నారు . పార్టీకి ఒక్కరే నాయకత్వం వహించాలని సూచించారు. ఆ తర్వాత జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి జనరల్ సెక్రెటరీగా ఎన్నికయ్యారు. అయితే, తాజాగా మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో పన్నీర్ సెల్వంకు భారీ ఊరట లభించినట్లయింది.

