“ఒక్కరు కాదు- ముగ్గురు ముద్దు” చైనా కొత్త జనాభా నినాదం
“దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్” అన్నారు మన గురజాడ అప్పారావు గారు. ఆయన అన్నట్లే దేశమంటే మనుషులని తెలుసుకుంటోంది మన పొరుగున ఉన్న చైనా. ఇన్నాళ్లూ ఒకే ఒక్క సంతానం చాలన్న చైనా ఇప్పుడు పిల్లల్ని కనమని ప్రజలను బ్రతిమాలుతోంది. గత ఏడాది ముగ్గురు పిల్లల విధానానికి కూడా అనుమతినిచ్చింది. ప్రపంచ జనాభాలో మొదటిస్థానంలో ఉన్న చైనాలో ఇప్పుడు జనాభా వృద్ధిరేటు తగ్గుతూ వస్తోంది. ఇది ఇలా కొనసాగితే 2025 నాటికి దేశంలో గణనీయంగా జనాభా తగ్గే అవకాశాలున్నయి. దీనితో చైనా అప్రమత్తమై జనాభాను పెంపొందించే పనిలో పడింది. ఎక్కువమంది పిల్లలను కనేలా ప్రజలను ప్రోత్సహిస్తోంది.

చైనా జాతీయ ఆరోగ్యకమీషన్ తాజాగా నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. పిల్లలను కనేవారికి సబ్సిడీలు, పన్నురాయితీలు, ఆరోగ్యబీమా వంటి సౌకర్యాలను కలిగిస్తున్నారు. దేశవ్యాప్తంగా పిల్లల సంరక్షణ సేవలను మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. 2022 చివరినాటికి చిన్నారులకు తగినన్ని నర్సరీలు ఏర్పాటుచేయాలని పేర్కొంది. జనాభా వృద్ధిరేటు తగ్గడంతో చైనాలో శ్రామికశక్తి తగ్గుతోంది. అందువల్ల ఆర్ధిక వ్యవస్థ ప్రమాదంలో పడింది. గత సంవత్సరం చైనా జననాలరేటు ప్రతీ వెయ్యిమందికి 7.52కి పడిపోయింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడిన 1949 నుండి జననాలరేటు ఇదే అతి తక్కువ కావడం విశేషం. ప్రజలు చిన్న కుటుంబాలకు అలవాటు పడిపోవడం వల్ల, వారి జీవన ప్రమాణాలు పెరిగి, పిల్లలను కనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీనితో దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోయి, యువకుల సంఖ్య తక్కువగా ఉంది. అందువల్ల పనిచేసేవారు తగ్గిపోయారు. దీనితో చైనా బెంబేలెత్తిపోతోంది. అందుకే ఈ తాయిలాలు ప్రకటించింది. ఒకప్రక్క భారతదేశంలో జనాభా 140 కోట్లకు పరుగులు పెడుతూ మొదటిస్థానానికి చేరువవుతోంది.