పాక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం…20 మంది సజీవ దహనం..
పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో నిన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు, చమురు ట్యాంకర్‌ను వెనుకనుంచి ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి 20 మంది సజీవ దహనమయ్యారు. లాహోర్‌కు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముల్తాన్-సుక్కూర్ ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం తర్వాత మంటలు ఎగిసిపడటంతో కొన్ని గంటలపాటు ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది.

లాహోర్ నుండి కరాచీకి వెళ్తున్న బస్సు, ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొన్న తర్వాత బస్సు, ట్యాంకర్ రెండూ మంటల్లో చిక్కుకున్నాయి. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్ తో పాటు 24 మంది ప్రయాణీకులు ఉన్నారు. వీరిలో 18మంది మంటల్లో చిక్కుకొని సజీవదహనం అయ్యారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. వీరితో పాటు మరో ఆరుగురు ప్రయాణీకులు గాయపడ్డారు. తీవ్ర గాయాలతో ఉన్నవారిని ముల్తాన్‌లోని నిష్టర్ ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో మరణించిన ప్రయాణీకుల మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయాయి. మృతదేహాలను DNA పరీక్షలు నిర్వహించిన తర్వాత కుటుంబాలకు అప్పగిస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు.

