Andhra PradeshNews

ఏపీలో నువ్వా-నేనా

నూటికో.. కోటికో ఒక్కరికి మాత్రమే పాలించే అవకాశం లభిస్తుంది. అలాంటి ఒక్క ఛాన్స్ కోసం రాజకీయ నాయకులు ఏమైనా చెప్తారు. ఎంతకైనా తెగిస్తారు. ఏం చేసైనా… ఎలాగైనా
అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటారు. ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోవాలంటారు. అందుకు వారు చేయని ప్రయత్నం ఉండదు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆగమాగమవుతోంది. నాయకుల మధ్య విభేదాలు పాలనకు శాపంగా మారాయ్. మార్పు మంచిదే అనుకునే ప్రజలు ఒక్క ఛాన్స్ శాపంగా మారింది. 2014లో అధికారాన్ని అనుభవించిన ఆ పార్టీ… తామేం చేసినా… ఎలా వ్యవహరించినా తిరుగులేదనుకొంది. కట్ చేస్తే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజాక్షేత్రంలో ఓటమి పాలయ్యింది. 2014లో అధికారం మాదేనని… తిరుగులేదని భావించిన పార్టీ…. 2019లో మాత్రం అధికారాన్ని దక్కించుకొంది. కానీ… మరో రెండేళ్లకు ఏపీలో జరగనున్న ఎన్నికలు ఇప్పుడు ఆ పార్టీకి అగ్నిపరీక్ష పెడుతున్నాయ్. ఆంధ్ర ప్రదేశ్ భవితను నిర్ణయించే ఎన్నికలు 2024లో జరగనున్న తరుణంలో రాజకీయంగా వాటిజ్ వాట్ అన్నది విశ్లేషిద్దాం…

అప్పటి వరకు హైదరాబాద్ స్థానంగా ఆంధ్రప్రదేశ్ పాలన సాగింది. ఆ తర్వాత విజయవాడ కేంద్రంగా… అమరావతి సాక్షిగా పాలనను నాటి సీఎం చంద్రబాబు ప్రారంభించినా…
అది పూర్తి స్థాయిలోకార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత పగ్గాలు చేపట్టిన వైఎస్ జగన్ సర్కారు ప్రాధాన్యతల్లో రాజధాని అన్న మాటే లేకుండా పోయింది. కేవలం తనను వ్యతిరేకించారన్న వ్యక్తిగత కక్షతో జగన్మోహన్ రెడ్డి రాజధానిపై కక్ష తీర్చుకుంటున్నారంటూ విపక్షాలు గగ్గోలుపెడుతున్నాయ్. వాస్తవానికి భూమిపై పెట్టుబడి ఎప్పటికీ చెక్కుచెదరదు. అలాంటింది వేల ఎకరాలను సేకరించి.. ప్రజల భాగస్వామ్యంతో రాజధాని నిర్మాణం చేయాలని భావించిన లక్ష్యం మంచిదే అయినా… అందులో జరిగిన లోపభుయిష్టత ఇప్పటికే విమర్శలపాలవుతూనే ఉంది. పలానా చోట రాజధాని వస్తోందని… టీడీపీ నేతలు ముందుగానే భూములు కొనుగోలు చేశారని… ఇది క్విడ్ ప్రోకో అంటూ జగన్ సర్కారు… రాజధాని విషయంలో మూడేళ్లుగా మాట్లాడుతూనే ఉంది. మొత్తం వ్యవహారం న్యాయస్థానాల కనుసన్నల్లోకి వెళ్లిపోయింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ఏపీలో వచ్చే రోజుల్లో రాజకీయాలు అభివృద్ధి… రాజధాని.. సంక్షేమం చుట్టూ తిరగడం మాత్రం ఖాయం.

నవరత్నాలతో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేశానంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు పార్టీ నేతలను పరుగులుపెట్టిస్తున్నారు. 95 శాతం హామీలు అమలు చేశానంటోంది అధికార పార్టీ. కానీ వాస్తవం మాత్రం మరోలా ఉంది. పథకాలన్నీ ఓట్ల ముసుగు వేసుకొని జనం దగ్గరకి వస్తున్నాయన్నది జగమెరిగిన సత్యం. దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా బడుగుజీవులకు సర్కారు ఇచ్చే పథకాలే ఆసరా… అయితే ఆ ఆసరా వారిని ఉన్నతులను చేసేదిగా ఉండాలని కానీ… వారిని లాయాల్టీగా ఉండే ఒక వర్గంగా తయారు చేసుకోవాలని చూడటం నిజంగా హేయం. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతోంది. అభివృద్ధిని గాలికి వదిలేసిన పాలకులు… పేదలకు పథకాలిస్తున్నాం… ఎన్నికల్లో గెలుస్తామంటూ దీమాను ప్రదర్శిస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ జరుగుతున్న పద్ధతిని మాత్రమే ప్రశ్నిస్తారు. సర్కారు ఖజానాను… ఖాళీ చేసి వ్యక్తిగతంగా నింపుకోవాలని చూడటం ఈ మెడర్న్‌ పాలకులకు మాత్రమే చెల్లుతోంది. పింఛన్లిస్తున్నాం… ఇళ్లులిస్తున్నాం… వైద్యం అందిస్తున్నాం… విద్య అందుబాటులోకి తెచ్చామంటూ పాలకులు గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ అందులో లొసుగులు నిరుపేదల్ని వేధిస్తున్న మాటను మాత్రం మరిచిపోతారు. మద్యం మత్తు రేపుతున్న కల్లోలం అంతా ఇంతా కాదు.. సొంత బ్రాండ్లతో వేల కోట్ల రూపాయలను అప్పనంగా దోచుకుంటున్నారని ప్రధాని ప్రతిపక్షం విమర్శలకు అసెంబ్లీ సాక్షిగా సీఎం చేసిన కామెంట్స్ షాక్ కలిగిస్తాయ్. మీరలా చేసారు… మేం ఇలా చేస్తున్నామని చెప్పడం ఏంటి? వాళ్లే బాగా చేస్తే మీతో అవసరంఏముంటుంది? ఏపీలో రోడ్ల గురించి పక్క రాష్ట్రం మంత్రి మాట్లాడితే ఆ వార్త రోజంతా అదే న్యూస్ వైరల్ కావడం… ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సిచ్యువేషన్ కు నిదర్శనం కాదా… కక్షలు,కార్పణ్యాలతో ప్రత్యర్థులపై దాడులతో నవ సమాజానికి ఇచ్చే సందేశం ఏముంది? ఇవాళ అధికారం మీ చేతిలో ఉంది. మరి రేపో…

ఏపీలో ప్రధాన ప్రతిపక్షం సైతం వ్యవహరిస్తున్న తీరు జూగప్స కలిగిస్తోంది. కేవలం అధికారయావ తప్పించి మరోలా పరిస్థితులు ఏమాత్రం కన్పించడం లేదు. జగన్మోహన్ రెడ్డిని
ఎదుర్కోవడంలో టీడీపీ సైద్ధాంతిక వైఫల్యం చెందింది. చేతిలో అన్ని ఆయుధాలు ఉండి కూడా వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడాన్ని ఎవరు మాత్రం జీర్ణించుకుంటారు. జగన్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే విమర్శలు… ఏం చేసినా…ప్రశ్నిస్తామన్న ధోరణి… న్యూట్రల్ జనంలో చికాకు కలిగిస్తోంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పాలనపై కోటి ఆశలు పెట్టుకున్న ప్రజల ఆకాంక్షల విఫలమవుతున్న వేళ.. ప్రజలు ఆశాజ్యోతిగా నిలవాల్సిన పార్టీ… రాజకీయంగా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఇక మరో ప్రతిపక్ష పార్టీ జనసేన… మాటలు కోటలు దాటుతున్నాయ్. కార్యాచరణ లేదు. కసరత్తు లేదు. కవలం సింగిల్ పాయింట్ ఎజెండా… జగన్మోహన్ రెడ్డి యాంటీ. ప్రజలు కోరుకుంటోంది ఇది కాదు కదా… ప్రజలు పాలకుల నుంచి సంక్షేమం కోరుకుంటారు. కాదని ఎవరూ చెప్పరు. ప్రజలు పాలకుల దగ్గర్నుంచి అభివృద్ధి ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కేవలం సంక్షేమంతో ఒక వర్గం సంతోషంగా ఉండొచ్చు.. మరి ప్రభుత్వాల నుంచి ఎలాంటి చోదుడువాదోడు లేనివర్గాల పరిస్థితేంటి? వారి ఆకాంక్షలు నెరవేరేదేలా?

ఇలా ఏపీలో ఎన్నో ప్రశ్నలు… మరెన్నో సవాళ్లు ముందుకు వస్తున్నాయ్. రెండేళ్లలో ఎన్నికల పోరాటం జరగనున్న తరుణంలో… ఇప్పుడే సంకుల సమరం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ అంటేనే కులాల కుమ్ములాట. అన్న నానుడిని నిజం చేస్తూ… ఇప్పటికే కులాల వారీగా విడిపోయిన పరిస్థితి కన్పిస్తోంది. ప్రజలను భావోద్వేగం కలిపి ఉంచుతుంది. కానీ కులం కాదు. కులాలను నమ్ముకొని రాజకీయాలు చేయాలని చూసిన నాయకులంతా కాలగర్భంలో కలిశారు. కుల పార్టీలు అంతరించిపోయాయ్… కులాన్ని నమ్ముకుంటే ఎన్నికల్లో విజయం సాధించడం… ఈ ఆధునిక సమాజంలో అసాధ్యం. అందుకే ఏపీ ప్రజల సర్వతోముఖాభివృద్ధి… ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలను నిజం చేసేలా నిఖార్సయిన వార్తా కథనాలతో మీముందుకు వస్తోంది మన సర్కారు. ప్రజలు కోరుకుంటున్న సర్కారు… ఆంధ్ర రాష్ట్రంలో రావాలని… వారు జీవిన విధంలో సమూలమార్పులు రావాలని కోరుకుందాం.