Breaking Newshome page sliderHome Page SliderTelangana

ధరణి పోర్టల్ లోపాలపై ఉన్నత స్థాయి సమీక్ష

గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ వేదికగా జరిగిన అవకతవకలను వెలికితీసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ధరణి పోర్టల్‌లో ఉద్దేశపూర్వకంగా సృష్టించిన సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. సచివాలయంలో ఉన్నత స్థాయి కమిటీతో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ధరణి వ్యవహారం ‘తీగ లాగితే డొంక కదిలినట్లు’ ఉందని వ్యాఖ్యానించారు. వ్యవస్థాగత లోపాలను సృష్టించి కొందరు ప్రముఖులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ వ్యవస్థను వాడుకున్నారని విమర్శించారు.

పోర్టల్ నిర్వహణలో భద్రతాపరమైన వైఫల్యాలను మంత్రి ఈ సందర్భంగా ఎత్తిచూపారు. గతంలో సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించినప్పుడు గుర్తించిన లోపాలను సరిదిద్దకుండానే అంతా సవ్యంగా ఉన్నట్లు నివేదికలు ఇచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల లావాదేవీలకు సంబంధించిన కీలక సమాచారం లభించకుండా లాగిన్‌లను డిలీట్ చేశారని, ఫోరెన్సిక్ ఆడిట్‌లో ‘కోడ్ ఆడిట్’ నిర్వహించలేదని కమిటీ విచారణలో తేలిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తక్షణమే ధరణి పోర్టల్‌పై పూర్తిస్థాయి కోడ్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ధరణి నిర్వహణ బాధ్యతను ‘టెర్రాసిస్’ అనే విదేశీ సంస్థకు అప్పగించడం వల్లే డేటా భద్రతకు ముప్పు వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు.

ముందుముందు ఇటువంటి పొరపాట్లు జరగకుండా, అధికారుల ప్రమేయం లేకుండా ప్రజలకు సులభతరంగా ఉండేలా ‘భూభారతి’ పోర్టల్‌ను తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో చేపట్టిన విధంగానే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి పైసాను వసూలు చేస్తామని, అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి పొంగులేటి హెచ్చరించారు.