Breaking NewsHome Page Sliderhome page sliderNational

ఇది చరిత్రాత్మక బడ్జెట్

కేంద్ర బడ్జెట్-2026 భవిష్యత్తు భారత నిర్మాణానికి ఒక దిక్సూచి వంటిదని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. 2047 మిషన్ లక్ష్య సాధనలో ఈ బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తుందని, త్వరలోనే భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను ప్రతిబింబించేలా, ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తితో ఈ చరిత్రాత్మక బడ్జెట్‌ను రూపొందించామని ప్రధాని ప్రశంసించారు.

యువతకు ఉపాధి కల్పనతో పాటు గేమింగ్, టూరిజం, క్రీడా రంగాల్లో వారికి అపారమైన అవకాశాలు కల్పించేలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనకు ఊతమివ్వడం ద్వారా భారత్ ‘లోకల్ టు గ్లోబల్’ స్థాయికి ఎదుగుతుందని చెప్పారు. ముఖ్యంగా భారతదేశాన్ని గ్లోబల్ ‘డేటా సెంటర్ హబ్’గా మార్చేందుకు ట్యాక్స్ హాలీడే ప్రకటించడం ఒక విప్లవాత్మక నిర్ణయమని, దీనివల్ల వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఆయన వివరించారు.

నారీశక్తికి పెద్దపీట వేస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారని ప్రధాని కొనియాడారు. ఈసారి ఈశాన్య రాష్ట్రాల పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించామని, తద్వారా ఆ ప్రాంత ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని తెలిపారు. సంస్కరణలకు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చే ఈ బడ్జెట్, దేశ ప్రగతిని మరింత వేగవంతం చేస్తుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.