బీజేపీ కుట్రలను ప్రజలు గమనించాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ, లౌకికవాదానికి తూట్లు పొడిచేలా కుట్రలు చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. గాంధీభవన్‌లో సోమవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ , 2014 వరకు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం సామాన్యుల కోసం తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలను ప్రస్తుత పాలకులు అటకెక్కించారని మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు పేదలకు వ్యతిరేకంగా ఉన్నాయని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ఛిన్నాభిన్నమైందని ఆయన విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసం నుంచి వికాసం వైపు పయనిస్తోందని , కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సూచనలతో మేం సంక్షేమ పాలనను అందిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు . తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అన్ని రాష్ట్రాలు మన వైపు చూస్తున్నాయని ఆయన అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అయితే, ఈ ప్రక్రియను , కులగణన బిల్లులను బీజేపీ అడ్డుకుంటోందని, వారి కుట్రలను ప్రజలు తగిన రీతిలో అర్థం చేసుకోవాలని మహేశ్‌కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.

