భారత్ తో ఈయూ అజెండా
భారత్ పర్యటనకు ముందు ఒక సమగ్ర, చారిత్రక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని యూరోపియన్ యూనియన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. రాబోయే ఈయూ బృందం భారత్ పర్యటనలోనే ఈ ఒప్పందం ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ఈయూ విదేశాంగ, భద్రతా విధానాల ప్రతినిధి కాజా కల్లాస్ పేర్కొన్నారు. యూరోపియన్ పార్లమెంట్లో మాట్లాడిన ఆమె, భారత్–ఈయూ సంబంధాలు కొత్త దశకు చేరుకోబోతున్నాయని తెలిపారు. భారత్–ఈయూ మధ్య 16వ శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియా కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లియన్ భారత్కు రానున్నారు. ఈ పర్యటనలోనే భారత్–ఈయూ వ్యూహాత్మక అజెండాను ఆమోదించే అవకాశం ఉంది. అందుకే కాజా కల్లాస్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ, దౌత్య వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
‘‘భారత్తో పటిష్టమైన, నూతన వాణిజ్య అజెండాను అమలు చేయడానికి యూరప్ సిద్ధంగా ఉంది. భారత్తో భద్రత, రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఈయూ నిర్ణయించింది. సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధం, సైబర్ సెక్యూరిటీ వంటి కీలక రంగాల్లో సహకారాన్ని విస్తరించే ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. వచ్చే వారం ఢిల్లీలో జరిగే ఈయూ–ఇండియా సమ్మిట్లో ఈ ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశాన్ని ఎదురుచూస్తున్నాం’’ అని కాజా కల్లాస్ వెల్లడించారు.
ఇదే సమయంలో భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాండెర్ లియన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్–ఈయూ మధ్య కుదిరే వాణిజ్య ఒప్పందం చివరి దశకు చేరుకుందని, దీన్ని ‘అన్ని ఒప్పందాలకు తల్లి’గా కొందరు అభివర్ణిస్తున్నారని ఆమె గుర్తుచేశారు. దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా మాట్లాడుతూ, ఈ ఒప్పందం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ ఒకటి రూపుదిద్దుకుంటుందని తెలిపారు.
‘‘మేం చారిత్రక వాణిజ్య ఒప్పందానికి అంచున ఉన్నాం. ఈ ఒప్పందం ద్వారా 2 బిలియన్ జనాభా గల మార్కెట్ ఏర్పడుతుంది. ఇది ప్రపంచ జీడీపీలో దాదాపు 25 శాతానికి సమానం. ఒప్పందానికి సంబంధించి ఇంకా కొంత పని మిగిలి ఉంది. వచ్చే వారంలో భారత్కు వస్తున్నాను. ఈ పర్యటనలో వాణిజ్య ఒప్పందంతో పాటు భారత్–యూరప్ ఆర్థిక, వ్యూహాత్మక సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే నా లక్ష్యం’’ అని వాండెర్ లియన్ స్పష్టం చేశారు.
జనవరి 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు ఈయూ అగ్రనేతలు భారత్లో పర్యటించనున్నారు. జనవరి 27న జరిగే 16వ భారత్–ఈయూ సమ్మిట్లో ప్రధాని నరేంద్ర మోదీతో విస్తృత చర్చలు జరపనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో కూడా సమావేశం కానున్నారు. 2004 నుంచి భారత్–ఈయూ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. ఇప్పటివరకు 15 శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. 17 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ మెగా ఎఫ్టీఏ ఈదఫా కుదిరితే , అది ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో ఒకటిగా చరిత్రలో నిలిచే అవకాశముందని దౌత్య వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

