Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టాలి

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బొందపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లిలో ఆదివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సభలో ఆయన పాల్గొన్నారు. మున్నేరు లింక్ కెనాల్, జేఎన్టీయూ, నర్సింగ్ కళాశాలలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు . ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ , సంక్షేమ పథకాల అమలులో దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రేవంత్ రెడ్డి చెప్పారు . పేదల ఆకలి తీర్చిన ఎన్టీఆర్, ఉచిత విద్యుత్ అందించిన వైఎస్సార్‌ల అడుగుజాడల్లోనే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత సన్నబియ్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందజేస్తామని, భద్రాచలం రామాలయాన్ని అయోధ్య తరహాలో అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

బీఆర్ఎస్ నాయకత్వంపై సీఎం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌస్ కేంద్రంగా కుట్రలు చేస్తున్నారని, ఆయన భూ బకాసురులకు, కబ్జాదారులకు గురువులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం చేస్తున్న మారీచులకు, శుక్రాచార్యులకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రాబోయే పదేళ్ల కాలం కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

నర్సింగ్ విద్యార్థినులతో సీఎం రేవంత్ ముచ్చటించారు . వైద్య వృత్తిలో దైవత్వం ఉంటుందని, వృత్తి ధర్మాన్ని పాటించాలని సూచించారు. విదేశాల్లో నర్సింగ్ అభ్యర్థులకు ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, జపాన్, జర్మన్ వంటి భాషల్లో శిక్షణ ఇస్తామని ప్రకటించారు.