Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

తల్లిదండ్రులను చూసుకోని జన్మ వ్యర్థం

జీవితంలో ఏ స్థాయికి ఎదిగినా, ఎన్ని విజయాలు సాధించినా కన్నతల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆ జీవితం వ్యర్థమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టెబోయినపల్లిలో రూ. 200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం క్యాంపస్ నిర్మాణానికి ఆయన శనివారం భూమిపూజ చేశారు. తర్వాత విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “మీరు భవిష్యత్తులో గొప్ప స్థాయికి వెళ్లవచ్చు. కానీ మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చిన తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వని పక్షంలో మీరు సాధించిన విజయం వృథా. తల్లిదండ్రులను బాగా చూసుకోవడంతో పాటు, మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన ఊరిని కూడా ఎప్పటికీ మర్చిపోవద్దు,” అని హితవు పలికారు. సక్సెస్ కావాలంటే పట్టుదల, కమ్యూనికేషన్ స్కిల్స్, నాలెడ్జ్‌తో పాటు చేసే పనిలో చిత్తశుద్ధి ఉండాలని సూచించారు.

మారుమూల అచ్చంపేట నియోజకవర్గంలో పుట్టిన ఆయన , పట్టుదలతో 17 ఏళ్లలోనే దేశంలోని అన్ని చట్టసభల్లో పనిచేరని, 2006లో జడ్పీటీసీగా ప్రారంభించి, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా బాధ్యతలు నిర్వహించి నేడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇక్కడకు వచ్చానని సీఎం తన రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు . ఈ పద్ధతిలోనే విద్యార్థులు కూడా ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని ఆకాంక్షించారు.
మహబూబ్‌నగర్ జిల్లాను విద్యా రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఈ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ నిర్మాణాన్ని ఏడాది కాలంలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఐఐఐటీతో పాటు ఇంజనీరింగ్, లా, మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని ఎడ్యుకేషనల్ హబ్‌గా మారుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.