Breaking Newshome page sliderHome Page SliderNational

సికింద్రాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ‘శాంతి ర్యాలీ’ భగ్నం

సికింద్రాబాద్ ప్రాంతాన్ని ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రకటించాలన్న డిమాండ్‌తో భారత్ రాష్ట్ర సమితి శనివారం తలపెట్టిన ‘శాంతి ర్యాలీ’ ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ఈ ప్రదర్శనకు అనుమతి నిరాకరించడంతో పాటు, ర్యాలీకి సిద్ధమైన పార్టీ శ్రేణులను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టులు చేయడంతో సికింద్రాబాద్ పరిసరాల్లో రోజంతా హైడ్రామా నెలకొంది.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. అయితే, శాంతిభద్రతల దృష్ట్యా ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ జంక్షన్ల వద్ద వేలాది మంది పోలీసులను మోహరించారు. నిరసనకు వస్తున్న కార్యకర్తలను, నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

పాలన ‘పిచ్చోడి చేతిలో రాయిలా’ మారింది: కేటీఆర్

సికింద్రాబాద్ లో నిర్వహించిన ఈ ర్యాలీని అడ్డుకోవడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.గతంలో పుస్తకాల్లో చదువుకున్న తుగ్లక్ పాలనను నేడు రేవంత్ రెడ్డి రూపంలో చూస్తున్నాం. అధికార చిహ్నాల మార్పు, తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మను తొలగించడం వల్ల ప్రజలకు వచ్చే లాభమేంటి? రేవంత్ రెడ్డి నిర్ణయాలు సికింద్రాబాద్ ఉనికిని దెబ్బతీసేలా ఉన్నాయని , అధికారం ఎవరికీ శాశ్వతం కాదని , ప్రజల అస్తిత్వంతో ఆడుకుంటే కాలమే సమాధానం చెబుతుందని కేటీఆర్ హెచ్చరించారు . బీఆర్‌ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే సికింద్రాబాద్‌ను ప్రత్యేక జిల్లాగా మారుస్తామని చెప్పారు .

నిరంకుశత్వమే ఈ ప్రభుత్వ పాలసీ: హరీశ్ రావు

శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం హేయమైన చర్య అని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యమే మా ఏడవ గ్యారంటీ అని చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ప్రశ్నించే గొంతుకలను నొక్కుతున్నారని , రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చడం సిగ్గుచేటని హరీశ్ రావు విమర్శించారు . గాంధేయ మార్గంలో నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని , అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని , మీ నిర్బంధాలకు భయపడేది లేదని హరీశ్ రావు హెచ్చరించారు .

ర్యాలీ చేయడానికి మాకు హక్కు లేదా?: తలసాని

సికింద్రాబాద్ కార్పొరేషన్ సాధన పోరాటానికి నేతృత్వం వహిస్తున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు . ర్యాలీ కోసం ఐదు రోజుల ముందే అనుమతి కోరితే, అర్థరాత్రి 10:40 గంటలకు పర్మిషన్ లేదని చెప్పడం ఏంటి? ముందే చెబితే మేము కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకునే వాళ్లమని తలసాని ప్రశ్నించారు . రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ ముందు ర్యాలీ చేయవచ్చు కానీ, మేము శాంతియుతంగా నిరసన తెలపకూడదా? సికింద్రాబాద్‌లో కర్ఫ్యూ వాతావరణం సృష్టించారని , త్వరలోనే న్యాయస్థానం ద్వారా అనుమతి తెచ్చుకుని భారీ ర్యాలీ నిర్వహిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ తేల్చి చెప్పారు .

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు జరగాల్సిన ఈ ర్యాలీని భగ్నం చేసేందుకు పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ సర్కిల్ వద్ద వేలాది మంది పోలీసులను మోహరించారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపేందుకు వస్తున్న కార్పొరేటర్లను, కార్యకర్తలను బలవంతంగా పోలీస్ వ్యాన్లలో ఎక్కించి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీఆర్‌ఎస్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ర్యాలీని నిర్వహించనివ్వకపోవడంపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి