డిజిటల్ ఐడీలపై బ్రిటన్ యూటర్న్
దేశంలో అక్రమ వలసలను నియంత్రించేందుకు డిజిటల్ ఐడీ కార్డులను ప్రధాన ఆయుధంగా యోచించిన బ్రిటన్ ప్రభుత్వం తాజాగా యూటర్న్ తీసుకుంది. దేశంలో ఉద్యోగం పొందేందుకు డిజిటల్ ఐడీ కార్డు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. డిజిటల్ విధానంపై ప్రతిపక్షాలతో పాటు అధికార లేబర్ పార్టీలోనూ విమర్శలు వెల్లువెత్తడంతో ప్రధాని కీర్ స్టార్మర్ సర్కార్ యూటర్న్ తీసుకుంది.
గత సెప్టెంబర్‌లో ప్రధాని స్టార్మర్ , అక్రమ వలసలను నియంత్రించేందుకు, పనివేళ్లలో చట్టబద్ధతను నిర్ధారించేందుకు డిజిటల్ ఐడీ వ్యవస్థ అవసరమని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఆరోగ్య సంరక్షణ, సంక్షేమ పథకాలు, చిన్నారుల భద్రతతో పాటు ప్రభుత్వ సేవలను మరింత సరళతరం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో భారత్‌లో అమలులో ఉన్న ‘ఆధార్’ విధానంపై కూడా ఆయన ఆసక్తి వ్యక్తం చేశారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సామాన్య పౌరులకు డిజిటల్ ఐడీలను తప్పనిసరి చేయడం బ్రిటన్‌లో ఎప్పుడూ అమలులోకి రాలేదు. దశాబ్దాలుగా వివాదాస్పదంగానే కొనసాగుతోంది. గతంలో మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సైతం ఉగ్రవాదం, మోసాలను నియంత్రించేందుకు ఈ విధానాన్ని ప్రతిపాదించినప్పటికీ తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యతకు ముప్పు ఉంటుందన్న వాదనలతో ప్రభుత్వాలు వెనకడుగు వేస్తూనే ఉన్నాయి.

