ఉపాధి కూలీలకు వరం ‘వీబీ జీరామ్ జీ’
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘వీబీ జీరామ్ జీ’ పథకంతో ఉపాధి హామీ కూలీల ఆదాయం రెట్టింపు అవుతుందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా కూలీలకు ఏడాదిలో 200 రోజుల పాటు ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. ఈ పథకం అమలు కోసం కేంద్రం గతంలో కంటే అదనంగా రూ.17 వేల కోట్లు వెచ్చిస్తోందని, అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి అదనంగా రూ.340 కోట్లు కేటాయించబోతున్నట్లు స్పష్టం చేశారు.
పనుల కేటాయింపు మరియు నిర్వహణ విషయంలో కేంద్రం ఎటువంటి జోక్యం చేసుకోదని, స్థానికంగా నిర్ణయాలు ఉంటాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా రైతులకు మేలు చేసే విధంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ సీజన్ సమయంలో ఈ పథకం పనులు జరగవని, దీనివల్ల రైతులకు కూలీల కొరత ఉండదని, అదే సమయంలో కూలీలకు ఏడాది పొడవునా ఆదాయం మార్గం ఉంటుందని వివరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం ఈ అడుగులు వేస్తోందని బండి సంజయ్ పేర్కొన్నారు.

