Home Page Sliderhome page sliderInternational

ఇరాన్ మృతులపై ఇజ్రాయెల్ ఆందోళన

ఇరాన్‌లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో దాదాపు 538 మంది మృత్యువాత చెందడంపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు , రోజు రోజుకు పెరుగుతున్న మృతులపై అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇరాన్‌లో జరుగుతున్న తీవ్ర పరిణామాలను తమ ప్రభుత్వం నిశితంగా గమనిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ఇరాన్ ప్రజల ధైర్యసాహసాలను ప్రపంచం మొత్తం గౌరవంతో చూస్తోందని నెతన్యాహు స్పష్టం చేశారు. అమాయక పౌరులపై జరుగుతున్న హింసను ఆయన తీవ్రంగా ఖండించారు. పౌరుల హత్యలకు ఇజ్రాయెల్‌ పూర్తిగా వ్యతిరేకమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు.

మరోవైపు , గత 15 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల్లో దాదాపు 538 మంది ఆందోళనకారులు మరణించినట్లు నివేదికలు రావడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని గుటెరస్‌ పేర్కొన్నారు. ఇరాన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ స్పందించారు. నిరసనల నేపథ్యంలో ఇరాన్ అధికారులు సంయమనం పాటించాలని ఆయన కోరారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, శాంతియుత సమావేశాలు, సహవాస హక్కులను పూర్తిగా గౌరవించాలని, రక్షించాలని సూచించారు. ప్రజా ప్రదర్శనల సమయంలో అనవసరమైన బలప్రయోగానికి దూరంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన నెతన్యాహూ, “ఇరాన్‌లో స్వేచ్ఛ కోసం సాగుతున్న ఉద్యమం దేశమంతటా విస్తరిస్తోంది. నిర్బంధ పాలనకు వ్యతిరేకంగా ఇరాన్ పౌరులు చూపుతున్న అపూర్వ ధైర్యాన్ని ప్రపంచం ఆశ్చర్యంతో చూస్తోంది” అని వ్యాఖ్యానించారు. నిరసనకారులపై అధిక బలప్రయోగాన్ని ఖండించిన ఆయన, ఈ పరిస్థితులు ప్రజాస్వామ్య దేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఇరాన్ ప్రజల స్వేచ్ఛా పోరాటానికి ఇజ్రాయెల్‌ నైతిక మద్దతు కొనసాగుతుందని వెల్లడించారు. భవిష్యత్తులో పర్షియన్‌ జాతి అణచివేత పాలన నుంచి విముక్తి పొంది, ఇజ్రాయెల్‌తో స్నేహబంధాన్ని పునరుద్ధరించుకునే రోజు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ రోజు వస్తే రెండు దేశాలు కలిసి శాంతి, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతాయని పేర్కొన్నారు.

ఇరాన్ మాజీ క్రౌన్‌ ప్రిన్స్‌ రెజా పహ్లవి కూడా ఈ పరిణామాలపై స్పందించారు. అమెరికాలో ప్రవాస జీవితం గడుపుతున్న ఆయన, ఖమేనీ పాలనను ఉగ్రవాద పాలనగా అభివర్ణించారు. ఈ పాలన కూలిన తర్వాత ఇరాన్ ప్రజలు అమెరికాకు ముఖ్య భాగస్వాములుగా మారతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రజలు తమ స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ఈ సమయంలో అమెరికా మద్దతు కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.

వాటికన్‌లో ఏంజెలస్‌ ప్రార్థన అనంతరం పోప్‌ లియో కూడా ఇరాన్‌లో శాంతి నెలకొనాలని ప్రార్థించారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా పరిస్థితులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నిరసనకారులపై ప్రాణాంతక బలాన్ని ఉపయోగించొద్దని ఇరాన్‌ను ఆయన హెచ్చరించినట్లు యూఎస్‌ మీడియా పేర్కొంది.

ఇరాన్ వ్యాప్తంగా అనేక నగరాలు, పట్టణాల్లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అరెస్టులు, కఠిన చర్యలతో ఆందోళనలను అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు, అల్లర్లకు విదేశీ శక్తులే కారణమని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చెస్తోంది. ప్రజల ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించినప్పటికీ, నిరసనకారులపై ఎటువంటి సడలింపులు లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇరాన్ అటార్నీ జనరల్ మొహమ్మద్‌ మోవహెడి అజాద్ హెచ్చరించడం గమనార్హం.