వెనెజువెలా అధ్యక్షుడిని నేనే
వెనెజువెలా రాజకీయ పరిణామాలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను తాను వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు సంచలనం రేపుతోంది. సోషల్ మీడియాలో ట్రంప్ తన ‘ట్రూత్ ఎక్స్ లో’ ఖాతాలో ఒక స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేయగా, అది వికీపీడియా పేజీని పోలినట్లుగా ఉండటం విశేషం. ఆ ఫొటోలో ఈ ఏడాది జనవరి నుంచి వెనెజువెలాకు తాత్కాలిక అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించినట్లు పేర్కొనడం గమనార్హం. దీంతో ఈ వ్యవహారం నిజమా? లేక ఎడిటెడ్ చిత్రమా? అన్న సందేహాలు మరోవైపు వెల్లువెత్తుతున్నాయి.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి పేరిట అమెరికా వెనెజువెలాపై మెరుపు దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. రాజధాని కారకాస్‌పై దాడులు జరిపిన అమెరికా బలగాలు అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను అదుపులోకి తీసుకుని అమెరికాకు తరలించాయన్న ప్రచారం జరిగింది. ఈ పరిణామాల తర్వాత ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినట్లు వెనెజువెలా రక్షణమంత్రి వెల్లడించారు. ఆమె 90 రోజులపాటు అధికారంలో కొనసాగుతారని తెలిపారు.
ఈ పరిణామాల వేళ వెనెజువెలా పూర్తిస్థాయి అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపడతారన్న అంశంపై అనిశ్చితి నెలకొంది. ప్రతిపక్ష నేత, నోబెల్ పురస్కార గ్రహీత మచాడోకు అవకాశం దక్కుతుందన్న ప్రచారం జరిగినప్పటికీ, ఆమెకు ప్రజల్లో సరైన మద్దతు లేదని పేర్కొంటూ ట్రంప్ విముఖత వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల మధ్య తానే తాత్కాలిక అధ్యక్షుడినంటూ ట్రంప్ ప్రకటించుకోవడం ప్రపంచ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది నిజమైన రాజకీయ సంకేతమా? లేక సోషల్ మీడియాలో సృష్టించిన కలకలమా? అన్నది వేచి చూడాల్సిందే.

