Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

నీటి హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తాం

పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగిస్తున్న అక్రమాలను, నిబంధనల ఉల్లంఘనలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లామని , తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడేందుకు ఎంతటి న్యాయపోరాటానికైనా సిద్ధమని రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో సోమవారం జరిగిన విచారణ తర్వాత ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, ఏపీ సర్కార్ అనుమతులు లేకుండా ప్రాజెక్టు డిజైన్లను మారుస్తోందని, దీనిపై తాము వేసిన రిట్ పిటిషన్‌ను కోర్టు సూచన మేరకు సివిల్ సూట్‌గా మార్చి రెండు రోజుల్లోనే దాఖలు చేస్తామని ప్రకటించారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీకి కేటాయించిన 484.5 టీఎంసీల కంటే అదనంగా నీటిని వాడుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. గోదావరి, కృష్ణా రివర్ బోర్డులతో పాటు అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా పనులు కొనసాగించడం చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన ‘స్టాప్ వర్క్ ఆర్డర్’ను కూడా ఏపీ ప్రభుత్వం బేఖాతరు చేస్తోందన్న విషయాన్ని ధర్మాసనానికి వివరించినట్లు తెలిపారు.
ప్రాజెక్టు అసలు రూపానికి భిన్నంగా ఎలాంటి మార్పులు చేసినా తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే కేటాయింపుల కంటే ఒక్క చుక్క నీరు కూడా అదనంగా వాడుకోకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించిన విధంగా ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేసి, రాష్ట్ర ప్రయోజనాల కోసం చట్టపరమైన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.