సికింద్రాబాద్‌ను ముక్కలు చేస్తే ఊరుకోం
డీలిమిటేషన్ పేరుతో చారిత్రాత్మక సికింద్రాబాద్‌ను ముక్కలు చేయాలని చూస్తే సహించేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సికింద్రాబాద్‌లోని బాలంరాయ్ ప్యాలెస్‌లో ‘లష్కర్ జిల్లా సాధన సమితి’ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కీలక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తాలసాని మాట్లాడుతూ.. గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు, సికింద్రాబాద్‌ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. “సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను” అని ఆయన ప్రకటించారు. డీలిమిటేషన్ ప్రక్రియలో 150 డివిజన్లను 300 చేయాలనుకున్నప్పుడు ప్రజల, ప్రజాప్రతినిధుల సలహాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని మండిపడ్డారు.
కేసీఆర్ హయాంలో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా వెలుగొందితే, గడిచిన రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నగరం సర్వనాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మనోభావాలతో ఆడుకుంటోందని, అభివృద్ధిని విస్మరించి రాజకీయ కుతంత్రాలకు పాల్పడుతోందని విమర్శించారు.

