Home Page Sliderhome page sliderTelangana

సాగుపై సోయిలేని సీఎం

హైదరాబాద్: తెలంగాణలో సాగుపై సోయి లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే.. నేడు అన్నదాతల బతుకులు ఎముకలు కొరికే చలిలో, యూరియా క్యూలైన్లలో తెల్లారుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. అందరినీ తొక్కుకుంటూ వచ్చానని చెప్పుకునే రేవంత్, తన విధ్వంసకర పాలనతో ఇప్పుడు సాక్షాత్తు రైతునే తొక్కుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై ఆయన ‘ఎక్స్’ వేదికగా శుక్రవారం ఆయన స్పందించారు.
ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో విశ్రాంతి తీసుకుంటుంటే, రైతులు మాత్రం తెల్లవారుజాము నుంచే చెప్పులను క్యూలో పెట్టుకుని ఎరువుల కోసం ఎదురుచూడాల్సిన దౌర్భాగ్య స్థితి నెలకొందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గత సీజన్ చేదు అనుభవాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదని, యూరియా కొరతను కప్పిపుచ్చేందుకు తెచ్చిన ‘యూరియా యాప్’ ఏమైందని నిలదీశారు. రైతులకు సమయానికి యూరియా కూడా అందించలేని ప్రభుత్వం అసలు అధికారంలో ఉండటానికి అర్హమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు నిత్యకృత్యంగా మారాయని, ఇదేనా మీరు చెప్పిన ‘మార్పు’ అంటూ హరీశ్ రావు నిప్పులు చెరిగారు.