పుతిన్ భారత్ టూర్ పై చైనా కధనాలు
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పాటు భారత్ సందర్ళనకు వచ్చారు. ఈ పర్యటనలో భారత్, రష్యాల మధ్య అనేక ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. ఈ పర్యటనపై చైనీస్ మీడియా ప్రశంసలు కురిపించింది. చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ పుతిన్, భారత పర్యటనను హైలెట్ చేసింది. చైనా విదేశాంగ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ లీ హైడాంగ్ చైనా మీడియాతో మాట్లాడారు. రష్యా, భారత్ మధ్య సమన్వయం, సహకారం రెండు దేశాల స్వతంత ప్రతిపత్తి, సామర్థ్యాలను బలోపేతం చేస్తున్నాయని ఆయన అన్నారు. భారత్ – రష్యా సంబంధం అత్యంత వ్యూహాత్మకమైనదని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే , పుతిన్ పర్యటనలో భారత్, రష్యా ఏ దేశమూ కూడా ప్రపంచంలో ఒంటరిగా లేదని ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని ఇస్తోందని లీ పేర్కొన్నారు. రెండు దేశాలు కూడా ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చుకుంటున్నారని, ఒకరి అవసరాలను మరొకరు తీర్చుకుంటున్నారని చెప్పారు. రష్యా, భారత్‌లపై అమెరికా, పాశ్చాత్య దేశాల ఆంక్షలు, ఒత్తిడి విజయం కావని అన్నారు. భారత్, రష్యా మధ్య సంబంధాలు కొన్ని విషయాలను స్పష్టం చేస్తున్నాయని, రష్యాకు గణనీయమైన శక్తి, ప్రభావం ఉందని పాశ్చాత్య ఆంక్షలు దాని ప్రయోజనాలు, డిమాండ్లను ప్రభావితం చేయలేదని అమెరికా, పాశ్చాత్య దేశాలకు నిరూపిస్తోందని లీ మాటల్ని ఉటంకిస్తూ గ్లోబల్ టైమ్స్ చెప్పింది. భారత్ తన సొంత ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని రష్యా పట్ల తన విధానాన్ని రూపొందిస్తుందని స్పష్టం చేస్తోందని గ్లోబల్ టైమ్స్ ప్రకటించింది.

