భారత్ కు పుతిన్ …
- పుతిన్ కోసం ప్రోటోకాల్ పక్కన పెట్టిన ప్రధాని మోదీ
- ప్రత్యేక విందు ఏర్పాటుచేసిన ప్రధాని
- ఒకే కారులో పుతిన్, మోదీ ప్రయాణం
- నేడు రాష్ట్రపతి తో పుతిన్ సమావేశం
- భారత్ – రష్యా ద్వైపాక్షిక అంశాలపై ప్రత్యేక సమావేశం
- రెండు దేశాల సంబంధాలు మరింత బలోపేతం : రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటన కోసం గురువారం సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా పాలం విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ మన దేశానికి రావడం ఇదే తొలిసారి. ఇరుదేశాల 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ఇరువురు దేశాధినేతలు సమావేశం కానున్నారు.
- పుతిన్ కోసం ప్రోటోకాల్ పక్కన పెట్టిన ప్రధాని మోదీ

అంతర్జాతీయంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు, పశ్చిమ దేశాల ఒత్తిడుల నడుమ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ మధ్య ఉన్న అసాధారణమైన స్నేహబంధాన్ని, బలమైన నమ్మకాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు. రెండు రోజుల అధికారిక పర్యటన కోసం గురువారం ఢిల్లీకి చేరుకున్న పుతిన్‌కు ప్రధాని మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలికారు. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి మోదీ చూపిన ఈ ప్రత్యేక చొరవ, ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహ బంధానికి అద్దం పట్టింది. విమానం దిగిన వెంటనే ఇరువురు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. తరువాత ఇద్దరూ ఒకే కారు లో విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ దృశ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యానికి మించి ఇరువురు నేతల మధ్య ఉన్న వ్యక్తిగత అనుబంధానికి, పరస్పర విశ్వాసానికి నిలువుటద్దంగా నిలిచింది.
- నేడు రాష్ట్రపతి తో పుతిన్ సమావేశం

అధికారిక షెడ్యూల్ లో భాగంగా పుతిన్ శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతితో సమావేశం జరగనుంది . తర్వాత ఆయన మహాత్మా గాంధీకి నివాళులు అర్పించడానికి రాజ్‌ఘాట్‌కు వెళ్తారు. తర్వాత , దౌత్య చర్చలు జరిగే హైదరాబాద్ హౌస్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ హౌస్‌లో అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ విందు ఇవ్వనున్నారు. మధ్యాహ్నం మిగిలిన సమయం ఇరుదేశాల ప్రతినిధుల బృందాల మధ్య నిర్మాణాత్మక సమావేశాల కోసం కేటాయించినట్లు అధికారులు తెలిపారు.
- భారత్ – రష్యా ద్వైపాక్షిక అంశాలపై ప్రత్యేక సమావేశం
భారత్ – రష్యా మధ్య రక్షణ సహకారం, ఇంధనం, వాణిజ్యం, దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రాజెక్టులు వంటి ద్వైపాక్షిక అంశాలపై ప్రధానంగా ఇరుదేశాల ప్రతినిధుల బృందాల మధ్య నిర్మాణాత్మక సమావేశం జరగనుంది .రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించి, భాగస్వామ్యానికి సాధ్యమయ్యే కొత్త రంగాలపై చర్చిస్తాయి.రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన పరిశ్రమ వర్గాల దృష్టిని సైతం ఆకర్షించింది. ఈ పర్యటన రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని వారు విశ్వసిస్తున్నారు. భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (FIEO) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ మాట్లాడుతూ, ప్రస్తుతం రష్యాతో భారతదేశ వాణిజ్యం అసమానంగా ఉందని తెలిపారు. “గత సంవత్సరం మేము రష్యా నుండి సుమారు 63 బిలియన్ డాలర్లను దిగుమతి చేసుకున్నాము. మా ఎగుమతులు కేవలం 5 బిలియన్ డాలర్లు. ఈ వాణిజ్యం వక్రంగా ఉన్నందున, మనం దానిని సమతుల్యం చేసుకోవాలి మరియు వైవిధ్యపరచాలి” అని ఆయన స్పష్టం చేశారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచడం, దిగుమతులు-ఎగుమతులను సమతుల్యం చేయడం, సాంకేతికత, పరిశ్రమలలో సహకారానికి కొత్త రంగాలను గుర్తించడంపై చర్చలు దృష్టి సారించాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పర్యటన వాణిజ్య సంబంధాలలో కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని ఆశిస్తున్నారు.
- భారత్–రష్యా సంబంధాలు మరింత బలోపేతం : రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
ప్రపంచ రాజకీయాలలో ఉన్న అనిశ్చితి మధ్య కూడా భారత్–రష్యా సంబంధాలు మరింతగా పటిష్టమవుతున్నాయని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్‌తో కలిసి 22వ భారత్–రష్యా సైనిక, సాంకేతిక సహకారం అంతర్ ప్రభుత్వ కమిషన్ సమావేశానికి సహాధ్యక్షత వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రష్యా భారత్‌కు ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామి అని రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. రష్యా రక్షణ మంత్రి బెలౌసోవ్ కూడా ఇరుదేశాల మధ్య సంబంధాలు పరస్పర గౌరవం, స్నేహంతో మరింత బలపడుతున్నాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో, న్యూఢిల్లీలో జరిగిన భారత–రష్యా వాణిజ్య వేదికలో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వ్యూహాత్మక సహకారం కాలపరీక్షను తట్టుకుని మరింత బలపడుతుందని అన్నారు. ఆరోగ్య రంగంలోనూ రెండు దేశాలు భాగస్వామ్యాన్ని విస్తరించడానికి అంగీకరించాయని ఆరోగ్య మంత్రి జె.పి. నడ్డా తెలిపారు.

