సీఎం సిద్ధరామయ్యకు డీకే నాటుకోడి విందు
బెంగళూరులోని సదాశివనగర్‌లో ఉన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నివాసానికి సీఎం సిద్దరామయ్య అల్పాహార విందుకు వెళ్లారు. శివకుమార్ , ఆయన సోదరుడు డీకే సురేష్ ఘన స్వాగతం పలికారు. డీకే సురేష్ పూలగుచ్ఛం అందించి ముఖ్యమంత్రి పాదాలకు నమస్కరించడం అక్కడ హైలైట్‌గా మారింది. తర్వాత అందరూ కలిసి ఇంట్లోకి వెళ్లి సమావేశమయ్యారు. సిద్ధరామయ్యకు ఇష్టమైన ఇడ్లీ–నాటుకోడి పులుసుతో డీకే శివ కుమార్ ప్రత్యేకంగా అల్పాహారం సిద్ధం చేశారు. నాటుకోడి మాంసంతో పులుసు, ఫ్రై వంటి వంటకాలు వడ్డించారు. ఈ విందుకు కుణిగల్ ఎమ్మెల్యే రంగనాథ్ కూడా హాజరయ్యారు. శివకుమార్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ముందుగా పట్టు చూపిన డీకే సురేష్ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.విందు తర్వాత సిద్ధరామయ్య, శివకుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 8న ఎంపీలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు , రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరుగుతుందని చెప్పారు. అధికార మార్పిడిపై హైకమాండ్ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని మరోసారి పునరుద్ఘాటించారు. త్వరలో కేసీ వేణుగోపాల్‌ను కలవనున్నట్లు సిద్ధరామయ్య వెల్లడించారు. శివకుమార్ సీఎం అయ్యే సమయం ఎప్పుడని మీడియా అడగగా “హైకమాండ్ తలచుకున్నప్పుడు” అంటూ సిద్ధరామయ్య చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు.
కర్ణాటక రాజకీయాల్లో బ్రేక్‌ఫాస్ట్ సమావేశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ల మధ్య నెలకొన్న అధికార బదిలీ వివాదం సద్దుమణిగిన తర్వాత ఇద్దరూ ఐక్యతను ప్రదర్శించుకుంటున్నారు. ఒకరి ఇంటికి ఒకరు అల్పాహార విందులకు హాజరవడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ట్రెండ్‌కు ఇది నాంది పలికినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. విభేదాలను తొలగించడానికి ఈ సమావేశాలను ఇద్దరూ వ్యూహాత్మకంగా వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల డీకే శివకుమార్ సిద్ధరామయ్య ఇంటికి వెళ్లి అల్పాహారంలో పాల్గొన్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ముఖ్యమంత్రి మార్పు విషయంలో హైకమాండ్ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. మీడియానే అనవసర గందరగోళం సృష్టిస్తోందని వ్యాఖ్యానించారు.

