శ్రీలంక కు మానవతా సాయంలో పాక్ దుర్భద్ది
శ్రీలంకలో దిత్వా తుపాన్ ప్రభావంతో మానవతా సహాయం కోసం ఎదురుచూస్తోంది. విమానాలకు భారత ప్రభుత్వం ఓవర్ ఫ్లైట్ క్లియరెన్స్ నిరాకరించిందన్నపాకిస్తాన్ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ కార్యాలయం జారీ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని భారత్ పేర్కొంది. భారత్‌పై వ్యతిరేకతను వ్యాప్తి చేయడానికి, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడానికి చేస్తున్న మరో ప్రయత్నమని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియా సమావేశాన్ని న్యూఢిల్లీలో మంగళవారం నిర్వహించారు.
ఓవర్ ఫ్లైట్ క్లియరెన్స్‌పై పాకిస్తాన్ చేసిన ప్రకటన గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు జైశ్వాల్ సమాధానమిస్తూ, పాక్ చేసిన అభ్యర్థనను భారత్ త్వరగా పరిశీలించి, ఓవర్ ఫ్లైట్ అనుమతిని మంజూరు చేసిందని జైస్వాల్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ చేసిన ప్రకటనను ఆయన తీవ్రంగా ఖండించారు. పాక్ వాదనను ఆయన పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు వెల్లడించారు.
శ్రీలంకకు మానవతా సహాయం తీసుకువెళుతున్న పాకిస్తాన్ విమానాలకు ఓవర్ ఫ్లైట్ క్లియరెన్స్ కోసం డిసెంబర్ 01న మధ్యాహ్నం 1.00 గంటలకు ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు దరఖాస్తు అందిందని తెలిపారు. మానవతా సహాయం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, భారత ప్రభుత్వం అదే రోజున అభ్యర్థనను వేగంగా పరిశీలించి అనుమతిని మంజూరు చేసిందని ఆయన తెలిపారు. అదేరోజు సాయంత్రం 4.30 గంటలకు ఓవర్ ఫ్లైట్ అనుమతిని మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. క్లిష్ట సమయంలో శ్రీలంక ప్రజలకు సహాయం చేయడానికి భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు.

